నంద్యాల, మే 21 (డిగ్నిటి న్యూస్): గత మూడు రోజులుగా స్థానిక గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్న జొన్న రైతులకు వైకాపా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు వైకాపా జిల్లా యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం భోజన వసతి కల్పించారు.
నిరుపేద రైతులు తిండి తిప్పలు మానేసి గోదాముల వద్దే బండ్లు నిలుపుకొని ఇబ్బందులు పడుతుండటాన్ని గమనించిన కాటసాని రాంభూపాల్ రెడ్డి, వారిని తక్షణమే ఆదుకోవాలని యువజన విభాగాన్ని పురమాయించారు.దీనిపై స్పందించిన జిల్లా వైకాపా యువజన విభాగం నేతృత్వంలో రైతులకు అక్కడికక్కడే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సద్దల చంద్రశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ అన్నదాతల కష్టాలను గుర్తించి అండగా నిలవడమే తమ పార్టీ ధ్యేయమని పేర్కొన్నారు. ఈ సేవా కార్యక్రమంలో వైకాపా యువజన విభాగం జిల్లా వైస్ ప్రెసిడెంట్ గోపురం జయప్రకాష్ నారాయణ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ గుండం నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
