వరికోయల వ్యర్థాల దహనం చేస్తుండగా ప్రమాదం
నకిరేకల్, జూన్ 3 (డిగ్నిటి న్యూస్): వ్యవసాయ పొలంలో వరికోత వ్యర్థాలను తగులబెట్టే క్రమంలో ప్రమాదవశాత్తు ఓ రైతు నిప్పుల చిక్కుకుని తీవ్రంగా గాయపడిన ఘటన నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… గొల్లగూడెం గ్రామపంచాయతీ పరిధికి చెందిన చిర్రబోయిన మీసాల లింగయ్య అనే రైతు బుధవారం తన వ్యవసాయ క్షేత్రంలో వరి కోయిల (పంట వ్యర్థాల)ను తొలగించేందుకు నిప్పు పెట్టారు.
ఈ క్రమంలో ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో పాటు గాలి తీవ్రత తోడై ప్రమాదవశాత్తు లింగయ్య ఆ మంటల్లో చిక్కుకుపోయారు. అక్కడ నుంచి తప్పించుకునే లోపే ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. పొలంలో నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడాన్ని, లింగయ్య ఆర్తనాదాలను గమనించిన పొరుగు చేలల్లోని తోటి రైతులు, స్థానికులు వెంటనే ఘటనా స్థలానికి పరుగులు తీశారు.
సమయస్ఫూర్తితో వ్యవహరించిన స్థానికులు మంటలను అదుపు చేసి, క్షతగాత్రుడైన లింగయ్యను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాద తీవ్రత, రైతు ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరావాల్సి ఉంది.

