నంద్యాల, మే 20 (డిగ్నిటి న్యూస్): నంద్యాల మండలంలో విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, బిల్బుక్స్, అనుమతి పత్రాలు పరిశీలించారు. వివిధ కంపెనీలకు చెందిన 10 రకాల ప్రత్తి విత్తనాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపించారు. అనంతరం నిర్వహించిన హెచ్టీ పరీక్షల్లో విత్తనాలు హెచ్టీ నెగిటివ్గా తేలినట్లు తెలిపారు. ప్రభుత్వ అనుమతి పొందిన విత్తనాలనే రైతులకు విక్రయించాలని, ఎంఆర్పీ కంటే అధిక ధరలకు అమ్మరాదని వ్యవసాయ అధికారి హెచ్చరించారు. స్టాక్ రిజిస్టర్లు, ధరల పట్టికలను ప్రతిరోజూ నవీకరించాలని సూచించారు. విత్తన చట్టం–1966, విత్తన నియంత్రణ క్రమం–1983 నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.

