గాలివాన బీభత్సం: నకిరేకల్ పరిధిలో రేకులు లేచిపోయి.. చెట్లు విరిగిపడి జనం బేజారు

రాత్రంతా చీకట్లోనే ప్రజల జాగారం.. ఉక్కపోత, దోమలతో తీవ్ర అవస్థలు

నష్టపోయిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తుల డిమాండ్

నకిరేకల్/గొల్లగూడెం, జూన్ 11 (డిగ్నిటి న్యూస్): నియోజకవర్గ పరిధిలో గురువారం కురిసిన భారీ వర్షం, గాలివాన తీవ్ర బీభత్సం సృష్టించాయి. గొల్లగూడెం గ్రామంలో ఈదురు గాలుల ధాటికి కొమ్మనబోయిన రమేష్ ఇంటి పైకప్పు రేకులు పూర్తిగా లేచిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందుల పాలైంది.

అలాగే గ్రామానికి చెందిన చిర్రబోయిన రామారావు ఇంటి పైకప్పు కూడా గాలివానకు దెబ్బతింది. ముక్కామల బిక్షమయ్య ఇంటి సమీపంలో విద్యుత్ తీగలు తెగిపడటంతో పాటు గ్రామంలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీనివల్ల గ్రామంలో పూర్తిగా కరెంట్ నిలిచిపోవడంతో ఉక్కపోత, దోమల కాటుతో ప్రజలు రాత్రంతా కంటిమీద కునుకు లేకుండా తీవ్ర అవస్థలు పడుతూ జాగారం చేశారు.

చందంపల్లి నుంచి గొల్లగూడెం, బొల్లారం వెళ్లే ప్రధాన రహదారిపై బొడ్డు బిక్షమయ్య పొలం వద్ద భారీ వృక్షం అడ్డంగా కూలడంతో గంటల తరబడి రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న గొల్లగూడెం సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ, గ్రామ పెద్దలు తక్షణమే స్పందించి చెట్టును తొలగించి దారి సుగమం చేశారు. కాగా, చందంపల్లి ఎస్సీ కాలనీలో సర్పంచ్ ఇంటి సమీపంలో కూడా చెట్టు కూలి విద్యుత్ స్తంభం విరిగిపడింది.

ఈ ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఆస్తి నష్టాన్ని పరిశీలిస్తున్నట్లు సర్పంచ్ లక్ష్మి సత్యనారాయణ తెలిపారు. అధికారులు తక్షణమే స్పందించి యుద్ధప్రాతిపదికన విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని, ఈ గాలివాన బీభత్సానికి నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచి, తగిన సహాయం అందించి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

బాధితులకు ప్రభుత్వం నుండి సహాయం అందేలా చూస్తాం: సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ

గొల్లగూడెంలో గురువారం సంభవించిన గాలివాన బీభత్సం వల్ల నష్టపోయిన కుటుంబాలకు ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో ప్రభుత్వం నుండి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ లక్ష్మీ సత్యనారాయణ తెలిపారు. గ్రామంలో రేకులు లేచిపోయిన ఇళ్లను, కూలిపోయిన విద్యుత్ స్తంభాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని అంచనా వేస్తున్నామన్నారు. ప్రధాన రహదారిపై కూలిన చెట్లను గ్రామ పెద్దల సహాయంతో ఇప్పటికే తొలగించి రాకపోకలను పునరుద్ధరించామని చెప్పారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి గ్రామంలో త్వరగతిన కరెంట్ సరఫరాను పునరుద్ధరించేలా ప్రత్యేక దృష్టి పెడతామని సర్పంచ్ వివరణ ఇచ్చారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *