నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): భూముల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ శనివారం కలెక్టర్లతో నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను బట్టి, ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం సవరణలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. అంతకుముందు కమిషనర్ లోకేష్ కుమార్ మాట్లాడుతూ, వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మే 28 నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయి ధరలను నిశితంగా పరిశీలించి, ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా శాస్త్రీయంగా విలువలను ఖరారు చేయాలని సూచించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గడువులోగా నివేదికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు.


