కేతేపల్లి: రాజకీయ కక్షలతో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చీకటిగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ పార్టీ తీరును ప్రశ్నించినందుకు గాను అదే గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ కార్యకర్త ఆల్దాస్ సతీష్ గౌడ్‌పై కాంగ్రెస్ శ్రేణులు మారణాయుధాలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సతీష్ ప్రస్తుతం సూర్యాపేటలోని ఆర్వీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విషయం తెలుసుకున్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆస్పత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో శాంతిభద్రతలు క్షీణించాయని, స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే కాంగ్రెస్ మూకలు అరాచకాలకు ఒడిగడుతున్నాయని ఆరోపించారు. రాజకీయ కక్షలతో భౌతిక దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని మండిపడ్డారు. పోలీసులు ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరిపి, దాడికి పాల్పడిన నిందితులతో పాటు దీని వెనుక ఉన్న సూత్రధారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. బాధితుడి కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
