నల్గొండ బ్యూరో, మే 8 (డిగ్నిటి న్యూస్): నల్గొండ మండల పరిధిలోని రసూల్ పూర్ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ కూలీలకు దిశానిర్దేశం చేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీల సౌకర్యార్థం వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) యాకూబ్ నాయక్ మాట్లాడుతూ ప్రస్తుత వేసవి దృష్ట్యా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని, కూలీలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఎండ తీవ్రత పెరగకముందే, అంటే తెల్లవారుజామునే పనులకు హాజరై నిర్ణీత సమయంలోగా పనులు పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ వహించరాదని, పని ప్రదేశంలో నీడను కల్పించుకోవడంతో పాటు క్రమం తప్పకుండా నీరు సేవించాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం శృతి లింగయ్య, గ్రామ సర్పంచ్ గుండెబోయిన వెంకన్న యాదవ్, పంచాయతీ కార్యదర్శి సంధ్య, ఆశా వర్కర్ రేణుక, మేట్ గోలి సైదులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉపాధి అవకాశాలను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సర్పంచ్ వెంకన్న యాదవ్ పేర్కొన్నారు. అనంతరం కూలీలందరికీ ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేసి ఎండల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు.
