హైదరాబాద్, మే 19 (డిగ్నిటి న్యూస్): అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరల పెరుగుదలను సాకుగా చూపుతూ చమురు సంస్థలు సామాన్యుడిపై భారం మోపడం సరికాదని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఐదు రోజుల వ్యవధిలోనే రెండోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం అత్యంత బాధాకరమన్నారు. గత శుక్రవారం లీటరుకు రూ. 3 పెంచిన సంస్థలు, నేడు మరో రూపాయి వరకు పెంచడం దారుణమన్నారు. ఈ పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹111.88కి చేరిందని, జిల్లాల్లో రవాణా ఖర్చుల వల్ల ఇది మరింత భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించని కంపెనీలు, ధరలు పెరిగినప్పుడు మాత్రం వెంటనే భారాన్ని నెట్టేయడం శోచనీయమన్నారు. ఇంధన ధరల పెరుగుదల వల్ల రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించకుండా, తక్షణమే స్పందించి ఎక్సైజ్ సుంకాలు, వ్యాట్ (VAT) తగ్గించడం ద్వారా సామాన్యులకు ఉపశమనం కల్పించాలని పాండురంగా రెడ్డి డిమాండ్ చేశారు. చమురు సంస్థలు తమ లాభాల కోసం ప్రజల నడ్డి విరవకుండా, తక్షణమే ధరల పెంపును నిలిపివేయాలని ఆయన హెచ్చరించారు.
ఇంధన ధరల పెంపుపై పాండురంగా రెడ్డి నిరసన
