నంద్యాల లో జిల్లా స్థాయి చదరంగ పోటీలు ప్రారంభం

నంద్యాల, మే 10 (డిగ్నిటి న్యూస్): స్థానిక టెక్కెలోని నెరవాటి ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో నంద్యాల జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా స్థాయి ఓపెన్ అండ్ ఉమెన్ చెస్ టోర్నమెంట్‌ను ఘనంగా ప్రారంభించారు. జిల్లా చెస్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి బోర్డుపై పావులు కదిపి ఈ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదరంగం క్రీడతో ఏకాగ్రత పెరుగుతుందని, తద్వారా విద్యార్థులు చదువులోనూ రాణించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

అంతర్జాతీయ రేటింగ్ సాధించిన పట్టణపు తొలి బాలిక శాలినిని ఈ వేదికపై మెమెంటోతో సత్కరించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ నెల 27వ తేదీన బాపట్లలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీల్లో నంద్యాల జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించారు. సుమారు 100 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ కృష్ణ సాయి రోహిత్, విశ్రాంత బ్యాంక్ మేనేజర్ నారాయణ రెడ్డి, టోర్నమెంట్ ఆర్బిటర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

Translate »