యాదగిరిగుట్టలో రూ. 99.55 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 23 (డిగ్నిటి న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆలయ అనుబంధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శనివారం ఘనంగా శంకుస్థాపన చేశారు. మొత్తం రూ. 99.55 కోట్ల వ్యయంతో చేపట్టనున్న వివిధ నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కాంచీ కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి పర్యవేక్షణలో, వేదమంత్రోచ్ఛారణల మధ్య తొలుత వేద పాఠశాల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు.

అనంతరం ఆలయానికి సంబంధించిన ఇతర అనుబంధ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేశారు.ఈ నిధుల్లో ప్రధానంగా రూ. 43.79 కోట్లతో అత్యాధునిక వేద పాఠశాలను నిర్మించనున్నారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో, 1,40,000 చదరపు అడుగుల వైశాల్యంతో మూడు దశల్లో ఈ పాఠశాల నిర్మాణం జరగనుంది. తొలిదశలో చేపట్టే ఈ నిర్మాణాల ద్వారా దాదాపు 500 మంది వేద విద్యార్థులకు ఇక్కడ విద్యానభ్యసించే అవకాశం లభిస్తుంది. విద్యార్థుల వసతి కోసం నివాస భవనాలు, డైనింగ్‌ హాల్‌తో పాటు దీనికి అనుబంధంగా యజ్ఞశాల, యాగశాలలను కూడా నిర్మిస్తున్నారు.మరో రూ. 43.12 కోట్లతో దీక్షాపరుల సదనం నిర్మాణానికి, రూ. 9.86 కోట్లతో కొండపై స్వామివారి నిత్య కల్యాణ మండప నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు.

భక్తుల సౌకర్యార్థం రూ. 1.41 కోట్లతో వైకుంఠ ద్వారం నుంచి కొండపైకి వెళ్లే మెట్ల మార్గానికి పైకప్పు (షెల్టర్) నిర్మాణం, రూ. 1.34 కోట్లతో రథశాల వైపు మాడవీధులకు మెట్ల నిర్మాణ పనులను చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, నల్గొండ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, ధార్మిక సలహాదారులు, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »