– నకిరేకల్ రెవెన్యూ నిర్లక్ష్యంతో వృద్ధురాలి గోస
– ఆర్డీవోను ఆశ్రయించిన వృద్ధురాలు
నల్గొండ, జూన్ 15 (డిగ్నిటి న్యూస్): కొన్నేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్య పరిష్కారం కావడం లేదని, పట్టాదారు పాసు పుస్తకంలో భూమి వివరాలు నమోదు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని గొల్లగూడెం గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు చిర్రబోయిన రమణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన రమణమ్మ సోమవారం నల్గొండ ఆర్డీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో తన మనవరాలి సహాయంతో హాజరై ఆర్డీవో అశోక్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా బాధితురాలు మాట్లాడుతూ దాదాపు 34 సంవత్సరాల క్రితం తాను కొనుగోలు చేసిన భూమిని నేటికీ అధికారులు పట్టాదారు పాసు పుస్తకంలో నమోదు చేయలేదని వాపోయారు. ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్టుకు తమ భూమికి ఎలాంటి సంబంధం లేకపోయినా, సర్వే నెంబర్ 173లో ఉన్న తన సొంత భూమి నుంచి 10 గుంటల భూమిని అక్రమంగా తొలగించారని ఆరోపించారు. తాము కొనుగోలు చేసిన 19 గుంటల భూమిని, తొలగించిన 10 గుంటలను కలిపి మొత్తం 29 గుంటల భూమిని తన పట్టాలో ఎక్కించాలని కోరారు. గత కొంతకాలంగా నకిరేకల్ మండల రెవెన్యూ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా అధికారులు పొంతన లేని సమాధానాలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వయసు పైబడటంతో నడవలేకపోయినా, మనవరాలి చేయి పట్టుకుని న్యాయం కోసం నేడు జిల్లా కేంద్రంలోని ప్రజావాణి వరకు రావలసి వచ్చిందని కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్డీవో అశోక్ రెడ్డి ఈ సమస్యపై స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వృద్ధురాలికి తక్షణమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సమస్య పట్ల ఉన్నతాధికారులు మానవతా దృక్పథంతో స్పందించి, తన భూమిని తన పేరు మీద ఎక్కించాలని ఆ వృద్ధురాలు వేడుకుంటున్నారు.

Chirraboina Rama Rao Yadav,
Dignity News Cheaf Editor,
AP/Telangana
