ఎన్టీఏను రద్దు చేయాలని పీడీఎస్యూ డిమాండ్
హైద్రాబాద్/అమరావతి: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.ఎం.డి. రఫీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని మండిపడ్డారు. దాదాపు 20 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎంతో కష్టపడి ఈ పరీక్షకు సిద్ధమయ్యారని, అయితే అధికారుల నిర్లక్ష్యం వల్ల పేపర్ లీక్ కావడంతో వారి భవిష్యత్తు అంధకారంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.గత ఏడాది హర్యానా, బీహార్ రాష్ట్రాల్లో జరిగిన లీకేజీ ఘటనలను గుర్తు చేస్తూ, ఈ ఏడాది కూడా అదే తరహాలో పేపర్లను భారీ ధరలకు అమ్ముకున్నారని ఆయన ఆరోపించారు. ఎన్టీఏ ఏజెన్సీ పర్యవేక్షణలో వరుసగా వైఫల్యాలు ఎదురవుతున్నాయని, కేవలం కొద్ది ఏళ్ల వ్యవధిలోనే రెండుసార్లు లీకేజీలు జరగడం కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి నిదర్శనమని విమర్శించారు. గతంలో రాష్ట్రాల వారీగా పరీక్షలు నిర్వహించినప్పుడు ఇలాంటి అక్రమాలకు తావులేదని, ప్రస్తుత కేంద్రీకృత విధానం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎన్టీఏ ఏజెన్సీని రద్దు చేయాలని, లేనిపక్షంలో విద్యార్థి లోకాన్ని ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని రఫీ హెచ్చరించారు.
