పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలి

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బైక్‌లను నెట్టుకుంటూ నిరసన

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 26 .(డిగ్నిటీ న్యూస్).పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండలోని సుభాష్ విగ్రహం నుండి క్లాక్ టవర్ వరకు బైక్‌లను నెట్టుకుంటూ వెళ్లి వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లం మహేష్ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. ఒకవైపు ప్రజల ఆదాయం తగ్గిపోతుండగా, మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.ప్రజల ఆదాయాన్ని పెంచాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా, ప్రజలపై మరింత భారాలు మోపుతూ “మునిగే నక్కపై తాటి పండు పడ్డట్లు” పరిస్థితిని సృష్టిస్తోందని విమర్శించారు.క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయని చెబుతూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతున్నారని, కానీ అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు మాత్రం రూపాయి కూడా తగ్గించడం లేదని ఆరోపించారు. దేశం, ధర్మం పేరుతో మాట్లాడుతున్న పాలకులు దేశ ప్రజలను ధరల మోతతో బ్రతకనివ్వడం లేదన్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే దశలవారీగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ప్రజావ్యతిరేక చర్య అని పేర్కొన్నారు.వెంటనే కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించి ప్రజలకు ఉపశమనం కల్పించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు కార్లపూడి రాము, మాదాసు రావణ్, ఎండీ అదిల్, శివ, సాయి, రోహిత్, మధు, రఘు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »