నల్గొండలో ఉర్దూ పాఠశాల భవన నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన
నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 10 (డిగ్నిటి న్యూస్): ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.

బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చెల్కలో రూ.44 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఉర్దూ మీడియం ప్రైమరీ స్కూల్ భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… అవసరమైతే రూ.కోటి వ్యయంతో ఈ పాఠశాలను సకల వసతులతో తీర్చిదిద్దుతామని, విద్యార్థులకు చిన్న వయసు నుంచే ఏఐ (కృత్రిమ మేధ) శిక్షణ అందిస్తామని ప్రకటించారు. గతంలో వైఎస్ఆర్ హయాంలోనే ఉర్దూను రెండో భాషగా గుర్తించి, సచార్ కమిటీ సిఫార్సుల మేరకు ముస్లింలకు 4% రిజర్వేషన్లు కల్పించామని ఆయన గుర్తుచేశారు. మైనార్టీల కోసం రూ.10 కోట్లతో షాదీఖానా నిర్మిస్తామని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కలెక్టరేట్ వెనుక ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పరిశీలించిన మంత్రి, చిన్నపాటి మరమ్మతులను పూర్తి చేసి జూలై నాటికి గృహప్రవేశాలకు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య, కలెక్టర్ బి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Chinta Yadaiah,
Nalgonda Ummadi jilla prathinidi,
Dignity News T/D
