- ఐదేళ్లుగా అసంపూర్తిగా పనులు..
- విద్యార్థుల బంగారు భవిష్యత్తు నాశనం చేయొద్దు
- మోహన్ నాయక్ ధ్వజం
గుత్తి, జూన్ 27 (డిగ్నిటి న్యూస్): గుత్తి పట్టణంలో ఐదేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోయిన ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ బాల బాలికల వసతి గృహాల (హాస్టల్స్) నిర్మాణాలను వెంటనే పూర్తి చేసి, అందుబాటులోకి తెవాలని హరిత దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బి. మోహన్ నాయక్ డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ ఆదర్శ మోడల్ కళాశాల ఆవరణలో విద్యార్థినులతో కలిసి ఆయన ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మోహన్ నాయక్ మాట్లాడుతూ.. ఏళ్లు గడుస్తున్నా హాస్టల్ భవనాల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ఇంటర్, డిగ్రీ, పీజీ చదువుతున్న విద్యార్థులు వసతి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జూన్ 13 నుంచే విద్యాసంస్థలు ప్రారంభమైనప్పటికీ, అధికారులు హాస్టల్స్ పునరుద్ధరణపై దృష్టి పెట్టకపోవడం దారుణమన్నారు.ప్రభుత్వాలు మారుతున్నా ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల వసతి గృహాల పట్ల నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆయన మండిపడ్డారు. ఉన్నత చదువుల కోసం పట్టణానికి వచ్చే పేద విద్యార్థులకు డిగ్రీ హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో, రూములు అద్దెకు తీసుకుని చదివించే స్థోమత లేక తల్లిదండ్రులు తమ పిల్లల చదువులను మధ్యలోనే ఆపేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చదువుకోవాల్సిన వయసులో బాలికలకు పెళ్లిళ్లు చేసి పంపుతుండటంతో వారి బంగారు భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన చెందారు. ఇప్పటికైనా రాష్ట్ర కూటమి ప్రభుత్వం స్పందించి, తక్షణమే పెండింగ్ భవన నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థినులు మానస, సాలమ్మ, వరలక్ష్మి, సావిత్రి, చంద్రకళ, మౌనిక, మహాలక్ష్మి, భార్గవి, చిట్టిమ్మ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

