పశువుల అక్రమ రవాణాపై కట్టుదిట్టమైన నిఘా

కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తనిఖీలు

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 11 (డిగ్నిటి న్యూస్): బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసు శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సోమవారం కోర్లపాడు టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక చెక్‌పోస్టును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోకి ప్రవేశించే ప్రతి వాహనాన్ని, ముఖ్యంగా కంటైనర్ లారీలు, లోడ్ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

వాహనాలకు సంబంధించిన పత్రాలు, పశువుల రవాణాకు అవసరమైన అనుమతులు, డ్రైవర్ల వివరాలను నిశితంగా పరిశీలించాలని సూచించారు.నిబంధనలకు విరుద్ధంగా, సామర్థ్యానికి మించి పశువులను తరలించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. రవాణా చేసే వ్యక్తులు తప్పనిసరిగా కొనుగోలు రసీదులు, వెటర్నరీ వైద్యుల ధృవపత్రాలు కలిగి ఉండాలని, జంతు సంరక్షణ చట్టాలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని వాహనాలను అడ్డుకోవాలని చూస్తే సహించేది లేదని, అటువంటి సమాచారాన్ని వెంటనే డయల్-100కు అందించాలని కోరారు. అలాగే సోషల్ మీడియాలో మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెడితే ఐటీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తప్పవన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా సరిహద్దుల వద్ద 24 గంటల నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శివరాం రెడ్డి, సీఐ హరిబాబు, ఎస్సైలు సతీష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.

Translate »