RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ఆన్‌లైన్‌ మందుల అమ్మకాలను నిలిపివేయాలి

బనగానపల్లెలో మెడికల్ స్టోర్స్ అసోసియేషన్ భారీ ర్యాలీ

బనగానపల్లె, మే 20: ఆన్‌లైన్‌లో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న మందుల విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బనగానపల్లె పట్టణంలో మెడికల్ స్టోర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఆల్ ఇండియా సమ్మెతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కెమిస్ట్స్ & డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ పిలుపులో భాగంగా స్థానిక ఔషధ దుకాణాలను పూర్తిగా మూసివేసి నిరసన తెలిపారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులు తహసీల్దార్ మంజునాథరెడ్డి, ఎస్సై దుగ్గిరెడ్డిలను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఫణీంద్ర, హిమాచల్ హాస్పిటల్ నిర్వాహకులు మంచాల చంద్రమౌళి రెడ్డి, లలిత మెడికల్ స్టోర్ అధినేత బండారు లలిత ప్రకాష్, రంగనాథ మెడికల్ స్టోర్ ప్రతినిధి తాళంకి ఆనంద్ మాట్లాడుతూ.. ఎలాంటి నియంత్రణ లేని ఆన్‌లైన్ మందుల విక్రయాల వల్ల ప్రజారోగ్యం ప్రమాదంలో పడటమే కాకుండా, నకిలీ మందుల ముప్పు పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేట్ శక్తుల ఆన్‌లైన్ వ్యాపారాల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది చిన్న కెమిస్టుల జీవనోపాధి దెబ్బతింటోందని వారు పేర్కొన్నారు. ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఔషధ రంగంలో నకిలీ మందులను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా పరిధిలోని కెమిస్టులు, డ్రగ్గిస్టులు అందరూ ఈ ఉద్యమానికి ఏకగ్రీవ మద్దతు తెలపాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గొల్ల రాముడు యాదవ్, రామచంద్రుడు, రాఘవేంద్ర, పరమేశ్వరుడు, సతీష్, సుధాకర్, నాగరాజు, రమేష్, బి. శేఖర్, విజయ్, మున్నా, రాజేష్, మిట్టపల్లి రామనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully