నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం.. ఆవాజ్‌కు బాబుల్లా గుడ్‌బై… తెలుగుదేశం పార్టీ బలోపేతమే లక్ష్యం.. మంత్రి ఫరూక్ సమక్షంలో రాజకీయ ప్రస్థానం

నంద్యాల, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నంద్యాల జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పట్టణంలో దశాబ్ద కాలంగా పేదలు, మైనారిటీల పక్షాన గళం వినిపిస్తూ, సేవా కార్యక్రమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆవాజ్ కమిటీ నాయకుడు ఎస్.ఏ. బాబుల్లా ఆ సంస్థకు రాజీనామా చేశారు. సామాజిక సేవా రంగం నుంచి రాజకీయ రంగంలోకి తన ప్రయాణాన్ని మరింత వేగవంతం చేస్తూ, తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి అంకితం కావాలనే ఉద్దేశంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజా క్షేత్రంలో ధైర్యశాలిగా పేరుగాంచిన బాబుల్లా నిష్క్రమణ ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. నంద్యాల పట్టణంలో ఆవాజ్ కమిటీ పేరు చెప్పగానే గుర్తొచ్చే అతికొద్ది మంది నాయకులలో బాబుల్లా ఒకరు. ముఖ్యంగా కరోనా వంటి కష్టకాలంలో ప్రాణాలకు తెగించి బాధితులకు అండగా నిలవడంలోనూ, ప్రతి ఏడాది పండుగ సమయాల్లో పేద ముస్లిం కుటుంబాలకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడంలోనూ ఆయన ముందు వరుసలో ఉండేవారు. అయితే కేవలం సేవా సంస్థల ద్వారానే కాకుండా, రాజకీయ అధికారం తోడైతే మరిన్ని అద్భుతాలు చేయవచ్చన్న సంకల్పంతో ఆయన సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్ర న్యాయ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూక్ నాయకత్వంపై నమ్మకంతో, ఆయన సారథ్యంలో పనిచేసేందుకు బాబుల్లా మొగ్గు చూపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువ నాయకుడు నారా లోకేష్‌ల దూరదృష్టితోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పయనిస్తుందని భావిస్తున్నట్లు ఆయన సన్నిహితుల వద్ద పేర్కొన్నారు. రానున్న 2029 ఎన్నికల్లో మళ్లీ తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా, రేపటి నుంచే ప్రజా క్షేత్రంలోకి వెళ్లనున్నట్లు సమాచారం. మంత్రి ఫరూక్ మార్గదర్శకత్వంలో మైనారిటీల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లడానికి బాబుల్లా తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆవాజ్ కమిటీకి సమర్పించడంతో ఆయన కొత్త రాజకీయ ప్రస్థానానికి తెరలేచినట్లయింది.

Translate »