

నకిరేకల్, మే 3 (డిగ్నిటి న్యూస్): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతుల జీవితాలు అంధకారంలోకి నెట్టబడ్డాయని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. ఆదివారం నకిరేకల్ పట్టణం మూసీ రోడ్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, కల్లాల్లో రోజుల తరబడి వేచి చూస్తున్న రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండించిన పంటను అమ్ముకోవడానికి అన్నదాతలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నకిరేకల్ నియోజకవర్గంలో పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయని, స్థానిక ఎమ్మెల్యే నియంతలా వ్యవహరిస్తూ ప్రతీ విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల గ్రామాల్లో ఘర్షణ వాతావరణం నెలకొందని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు షాడో పోలీసుల్లా మారి సామాన్య ప్రజలపై పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు.ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ప్రైవేటు వ్యక్తుల దోపిడీ పెరిగిందని, లారీల రాక, కాంటాల నిర్వహణపై ప్రశ్నించిన రైతులపై దాడులు చేయడం దుర్మార్గమని చిరుమర్తి ధ్వజమెత్తారు. నార్కట్‌పల్లి, నకిరేకల్ మండలాల్లో రైతులను కాలితో తన్నిన సంఘటనలు ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని, అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందుకు ఎమ్మెల్యే తక్షణమే రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోజులకు, రీల్స్‌కు ఇచ్చే ప్రాధాన్యత రైతుల సమస్యల పరిష్కారంపై చూపడం లేదని ఎద్దేవా చేసిన ఆయన, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేశారు.
