RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

గొల్లగూడెంలో మిన్నంటనున్న మల్లికార్జునుడి జాతర సంబరాలు

నకిరేకల్, మే 14 (డిగ్నిటి న్యూస్): నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం గ్రామం భక్తి సాగరంలో మునిగిపోనుంది. ఈనెల 17, 18 తేదీల్లో నిర్వహించనున్న శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవానికి గ్రామస్థులు సర్వం సిద్ధం చేశారు. రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా జరిగే ఈ ఉత్సవానికి వేలాదిగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు.

వేడుకగా స్వామివారి కళ్యాణం

జాతరలో భాగంగా సోమవారం నాడు శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా వెలుగొందుతున్న స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆదివారం జరిగే గంగ తెప్ప ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. డప్పు వాయిద్యాల మోత, బేరీలు, చండ్ర కోలల విన్యాసాల మధ్య గ్రామంలో పండుగ శోభ సంతరించుకోనుంది. భక్తులు “ఓలింగ.. ఓలింగ..” అంటూ చేసే నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగనున్నాయి.

ప్రభుత్వ విప్‌ వేముల వీరేశం కు ఆహ్వానం

ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని కోరుతూ నకిరేకల్ శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ వేముల వీరేశంను గ్రామ పెద్దలు, స్థానిక ప్రజాప్రతినిధులు కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. జాతర ప్రాముఖ్యతను వివరించి, ఉత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని విజ్ఞప్తి చేశారు.గొల్లగూడెం జాతర మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకని, ఈ ఉత్సవాలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ లక్ష్మి సత్యనారాయణ కోరారు. గ్రామానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహక బృందం స్పష్టం చేసింది.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully