నల్గొండలో విషాదం: సాగునీటి శాఖ ఈఈ ఆత్మహత్య

నల్గొండ, మే 04 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): నల్గొండ నీటిపారుదల శాఖలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ) డివిజన్ -6 గంధ వారి గూడెం గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సతీష్ చంద్ర యాదవ్ ఆకస్మిక మరణం జిల్లావ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఉదయ సముద్రం ఎత్తిపోతల పథకం పరిధిలోని చందనపల్లి సమీపంలో గల డి-37 కాల్వలోకి దూకి ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. సోమవారం ఉదయం విధులకు వెళ్తున్నట్లుగా బయలుదేరిన ఆయన, చందనపల్లి వద్దకు చేరుకోగానే ఎవరూ లేని సమయం చూసి ఒక్కసారిగా కాల్వలోకి దూకారు. నిరంతరం ప్రవహించే నీటి ఉధృతికి ఆయన క్షణాల్లో కొట్టుకుపోవడంతో స్థానికులు అప్రమత్తమయ్యే లోపే ప్రమాదం జరిగిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్ల సహాయంతో గంటల తరబడి శ్రమించిన అనంతరం మృతదేహాన్ని వెలికితీశారు.​విధి నిర్వహణలో ఎంతో సౌమ్యుడిగా, నిబద్ధత గల అధికారిగా పేరున్న సతీష్ చంద్ర ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తోటి ఉద్యోగులను, కుటుంబ సభ్యులను శోకసముద్రంలో ముంచెత్తింది. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు ప్రస్తుతం మిస్టరీగా మారాయి. వ్యక్తిగత సమస్యల వల్ల ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారా లేక ప్రాజెక్టు పనులకు సంబంధించి ఏవైనా ఒత్తిళ్లు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలం నుంచి సతీష్ చంద్ర మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆయన చివరిగా ఎవరితో మాట్లాడారు అనే కాల్ డేటాను విశ్లేషిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సమగ్ర విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ఒక ఉన్నత స్థాయి అధికారి ఆత్మహత్య చేసుకోవడం జిల్లా అధికార యంత్రాంగంలో చర్చనీయాంశంగా మారింది.

Translate »