కోదాడలో ఘోరం: భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

కోదాడ, మే 7 (డిగ్నిటి న్యూస్): సూర్యాపేట జిల్లా కోదాడలో బుధవారం రాత్రి దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి తన భార్యను నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి కిరాతకంగా హత్య చేశాడు. స్థానికులు మరియు పోలీసుల కథనం ప్రకారం.. మణిదీప్, శిరీష(24) దంపతుల మధ్య కొంతకాలంగా మనస్పర్థలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌లో వీరికి కౌన్సెలింగ్ నిర్వహించారు. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన కొద్దిసేపటికే మణిదీప్ కోపోద్రిక్తుడై బస్టాండ్ సమీపంలో శిరీషపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ప్రాణభయంతో ఆమె పరుగులు తీసినప్పటికీ, వెంటాడి కత్తితో బలంగా పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పట్టపగలు, జనసంచారం ఉన్న ప్రాంతంలో జరిగిన ఈ ఘోరాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Translate »