నంద్యాలలో వైసీపీ భారీ ర్యాలీ
కూటమి ప్రభుత్వంపై శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ధ్వజం
మహానేత విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించి తీరుతామని సవాల్
నంద్యాల, జూన్ 12 (డిగ్నిటి న్యూస్): కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నంద్యాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరిట గురువారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించాయి. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి పిలుపు మేరకు స్థానిక శిల్పా కార్యాలయం నుండి శ్రీనివాస సెంటర్ వరకు వేలాది మంది కార్యకర్తలతో ఈ ప్రదర్శన సాగింది. కూటమి ప్రభుత్వ మోసాలకు నిరసనగా నాయకులు ఎడ్లబండ్లు, గాడిదలతో వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం శ్రీనివాస సెంటర్ వద్ద దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, తల్లికి వందన, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అందిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు లబ్ధిదారులను కుదించి ప్రజలను వంచించిందని మండిపడ్డారు. సాగునీరు, యూరియా అందక రైతులు రోడ్డెక్కారని, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు. శ్రీనివాస సెంటర్లో ధ్వంసం చేసిన డా. వైఎస్సార్ విగ్రహాన్ని ప్రజల సాక్షిగా అక్కడే పునఃప్రతిష్ఠించి తీరుతామని, ప్రభుత్వం పట్టించుకోకపోతే తన సొంత ఖర్చులతోనైనా ఏర్పాటు చేస్తానని సవాల్ విసిరారు. జర్నలిస్టులకు ఇస్తామన్న 5 సెంట్ల ఇళ్ల స్థలాల హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్సీలు ఇసాక్ బాష, కల్పలతా రెడ్డి ప్రసంగిస్తూ.. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు పెరిగిపోయాయని, ప్రజా సమస్యలపై వైసీపీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Chirraboina Rama Rao Yadav,
Dignity News Cheaf Editor,
AP/Telangana
