- డిల్లీ లో పార్లమెంట్ వద్ద విద్యార్థులపై లాఠీచార్జ్ హేయమైన చర్య: పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎమ్డీ రఫీ డిమాండ్
నంద్యాల, జూలై 21 (డిగ్నిటి న్యూస్): నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఎమ్డీ రఫీ డిమాండ్ చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులు, ఉద్యమకారులపై పోలీసులు నిరంకుశంగా లాఠీచార్జ్ చేయడాన్ని, భాష్పవాయు గోళాలు ప్రయోగించడాన్ని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్‌యూ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. రాజీనామా చేయమని అడిగినందుకు విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం హేయమైన చర్య అని ఆయన మండిపడ్డారు. దేశంలోని నిరుద్యోగ యువత, విద్యార్థులపై దాడులు చేయడమేనా బీజేపీ చూపుతున్న దేశభక్తి అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అంబానీ, అదానీలపై ఉన్న భక్తి, దేశ భవిష్యత్తు అయిన నిరుద్యోగులు, విద్యార్థులపై లేకపోవడం విచారకరమన్నారు. దేశంలో దాదాపు 23 లక్షల మంది నీట్ విద్యార్థుల భవిష్యత్తును కాలరాస్తూ, గడిచిన 13 ఏళ్లుగా కేంద్ర విద్యా రంగాన్ని బ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలోని కీలక నియంత్రణ సంస్థలను కేంద్ర ప్రభుత్వం తమ జేబు సంస్థలుగా మార్చుకుందని విమర్శించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడుకోవడానికి ప్రముఖ శాస్త్రవేత్త సోనం వాంగ్‌చుక్, పలువురు విద్యార్థి నాయకులు గత 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా కేంద్రానికి కనీస పట్టింపు లేకపోవడం వారి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఎస్ఎమ్డీ రఫీ దుయ్యబట్టారు. విద్యా వ్యవస్థ బాగుపడాలని పోరాడుతున్న వారిపై సోషల్ మీడియాలో సంఘ్ పరివార్, మనువాద శక్తులు విమర్శలు చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతులను నొక్కడమంటే ఫాసిజాన్ని అమలు చేయడమేనని స్పష్టం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థి నాయకులతో చర్చలు జరపాలని, ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే కేంద్ర కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

