బెల్లంకొండ (చండ్రాజుపాలెం), మే 9 (డిగ్నిటి న్యూస్): పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెంలో వేంచేసియున్న శ్రీ వెంకటేశ్వర స్వామి తిరునాళ్ల సందర్భంగా ఏర్పాటు చేసిన ఆయుష్ వైద్య శిబిరానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రాంతీయ ఉపసంచాలకులు డాక్టర్ పి. జగదీష్ ఆదేశాల మేరకు డాక్టర్ ఆర్. శ్రీనివాస్, డాక్టర్ కాంచన, డాక్టర్ స్వర్ణలత ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని, ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వృద్ధులు, గర్భిణులు, చిన్న పిల్లలు రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీటితో పాటు మజ్జిగ, కొబ్బరి నీళ్లు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య బయటకు వెళ్లకపోవడం ఉత్తమమని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్తే గొడుగు, టోపీ వంటివి వాడాలని సూచించారు.

ఈ శిబిరానికి ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు, డాక్టర్ వీరయ్య, బీసీ నాయకులు గంగారాం ముఖ్య అతిథులుగా హాజరై రోగులకు మందులను పంపిణీ చేశారు. సుమారు 342 మందికి ఉచితంగా ఆయుష్ మందులను అందజేయడంతో పాటు వడదెబ్బ నివారణపై రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ సిబ్బంది వెంకటరామయ్య, కోటేశ్వరమ్మ, హనుమంతరావు, జిలాని, రమణ, పద్మజ తదితరులు పాల్గొన్నారు.
