మాది రైతు పక్షపాతి ప్రభుత్వం

రబీలో రైతులు పండించిన చివరి గింజ వరకు మద్దతు ధర చెల్లించి కొంటాం

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొన్నాం

4600 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో వేశాం- రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 14 (డిగ్నిటీ న్యూస్): దేశంలో వరి పండించడంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తంకుమార్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో కలిసి ఆయన నల్గొండ జిల్లా, కనగల్ మండలం చెట్ల చెన్నారం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న అనంతరం అక్కడే రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ గడచిన రెండున్నర సంవత్సరాలలో అత్యధికంగా వరి పండించిన కొనుగోలు చేసిన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు .ప్రతి రైతుకు మద్దతు ధర వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం 22 వేల కోట్ల రూపాయలను చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ రబీలో 65 లక్షల ఎకరాలలో 140 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందని తెలిపారు. అందులో 80 నుండి 90 లక్షలు మెట్రిక్ టన్నులు ప్రభుత్వం కొనుగోలు చేయనుందని, ధాన్యం కొనుగోలుకై 18.67 కోట్ల గన్ని బ్యాగులను పిపిసి సెంటర్లకు పంపించినట్లు మంత్రి వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రతి సెంటర్తో పాటు, మండల ,నియోజకవర్గ స్థాయిలో అధికారులను నియమించామని ,ధాన్యం కొనుగోలుకు అన్ని రకాల వాహనాలను వినియోగించుకునేలా జిల్లా కలెక్టర్లకు విస్తృత అధికారాలు కల్పించామని ,రాష్ట్రవ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోలుకు 8575 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ,ఇప్పటివరకు 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నామని,4600 కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లలో జమ చేయడం జరిగిందని, రానున్న రెండు, మూడు రోజుల్లో మరో 9 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపించడం జరుగుతుందని,అలాగే 3000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో జమ చేయనున్నామని చెప్పారు. మూడు లక్షల 84,000 మంది రైతుల ధాన్యాన్ని ఇప్పటివరకు కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.నల్గొండ జిల్లాకు సంబంధించి ఐదు లక్షల 46000 ఎకరాల్లో 14 లక్షల 65 వేల మెట్రిక్ టన్నులు ధాన్యం పండిందని,ఇప్పటివరకు ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నల్గొండ జిల్లాలో 7 లక్షల 24 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, నల్గొండ జిల్లాలోనే 456 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని ,కోటి 22 లక్షల గన్ని బ్యాగులు ఇచ్చామని, 53,611 మంది రైతులకు మద్దతు ధర చెల్లించి 692 కోట్ల రూపాయల రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందని, రెండు, మూడు రోజుల్లో మరో 400 కోట్లు రైతుల ఖాతాలలో ట్రాన్స్ఫర్ చేయనున్నట్లు వెల్లడించారు.

జిల్లాలో 1000 వాహనాలను రబీ ధాన్యంకై ఏర్పాటు చేయడం జరిగిందని, రైతులు పండించిన ధాన్యాన్ని ఎంఎస్పీ చెల్లించి కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, ధాన్యం సేకరణలో పశ్చిమబెంగాల్ కూలీలను వినియోగిస్తున్నందున అక్కడ ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా హమాలీల సమస్య ఉత్పన్నమైందని ,తరుగు,తాలు విషయంలో మిల్లర్లు ,ట్రేడర్లు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రాష్ట్రవ్యాప్తంగా 1800 మిల్లులు ఎంఎస్పి ఆపరేషన్ లో పాల్గొంటున్నాయని, 12 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన ఇంటర్మీడియట్ గోదాం సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి వెల్లడించారు.రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి, నల్గొండ జిల్లా ఇన్చార్జి మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రబీలో రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని ,అంతేకాక నిర్దేశించిన సమయంలో రైతుల ఖాతాలలో ధాన్యం డబ్బులు జమ చేయడం జరుగుతుందని, ట్రాన్స్పోర్ట్ ,హమాలి సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని, ఈసారి పెద్ద ఎత్తున పంట వచ్చిందని, రైతులకు కష్టం కలగకుండా రైతుల చెంతకే వచ్చి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొంటున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ గతంలో కంటే ఈ రబీలో నల్గొండ జిల్లాలో అత్యధిక ధాన్యం పండిందని ,గతం తో పోలిస్తే 30000 మెట్రిక్ టన్నుల ధాన్యం అధికంగా పండినట్లు తెలిపారు.

ధాన్యం కొనుగోలులో ఏర్పడిన హమాలి, ట్రాన్స్పోర్ట్ సమస్యను పరిష్కరించడం జరిగిందని , బుధవారం ఒక్కరోజే నల్గొండ జిల్లాలో 19000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగిందని, రానున్న పది రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేస్తామని తెలిపారు. ఏ ఎంఆర్పి కాలువల లైనింగ్ కోసం 450 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతున్నదని, ఎస్ఎల్ బి సి సొరంగం పూర్తయితే జిల్లాలో మరింత దాన్యం దిగుబడులు పెరుగుతాయి అన్నారు .లారీలు అవసరం ఉంటే మరిన్ని వినియోగించాలని, ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ప్రాధాన్యత క్రమంలో లారీలు అవసరం ఉన్న కొనుగోలు కేంద్రాలకు ముందుగా పంపించాలని చెప్పారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు సాఫీగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్ పి శరత్చంద్ర పవర్ ,రైతు కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, డి సి ఓ పత్యా నాయక్, పౌరరఫరాల జిల్లా మేనేజర్ రామ్ పతి నాయక్, డిఎస్ఓ వెంకటేశం, మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు మంత్రుల వెంట ఉన్నారు.

Translate »