జనగణన సందర్భంగా పూర్తి సమాచారం ఇచ్చి సహకరించండి.
నల్గొండ జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ విజ్ఞప్తి
నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 9 (డిగ్నిటీ న్యూస్): జనగణనకు ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్లకు సరైన సమాచారం ఇచ్చి సహకరించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ కోరారు. జనగణన అన్ని రకాల అభివృద్ధికి ముఖ్యమని, జనగణలో ప్రతి కుటుంబం వారి వివరాలను తెలియజేసి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.జనగణన పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ప్రచార రథాన్ని శనివారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జండా ఊపి ప్రారంభించారు.

2027 జన గణనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు మొదటి విడత సెల్ఫ్ ఎన్యుమరేషన్ చేపట్టడం జరిగిందని, అది ఈ నెల 10 తో ముగుస్తుందని, ఈ నెల 11 నుండి హౌస్ లిస్టింగ్, జనగణన కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని, జనగణనకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని చర్యలు చేపట్టిందని, ఈ నెల 11 నుండి ఎన్యుమరేటర్లు ఇంటింటికి వచ్చి జనాభా వివరాలు సేకరిస్తారని, ఇందుకు జిల్లాలోని ప్రజలందరూ సరైన, పూర్తి సమాచారం ఇచ్చి సహకరించాలని కోరారు. జనాభా వివరాల సేకరణ కేవలం జనాభా లెక్కలకు ఉద్దేశించి మాత్రమేనని కలెక్టర్ స్పష్టం చేశారు. జనగణనలో ఇండ్లకు సంబంధించిన వివరాలతో పాటు, కుటుంబాల వివరాలు సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. జనగణన పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించిన ప్రచార రథం జిల్లాలోని 33 మండలాల పరిధిలో పర్యటించి జనగణన పై ప్రజలకు అవగాహన కల్పిస్తుందని తెలిపారు. జిల్లాలోని ప్రజలందరూ జనగణనకు సహకరించాలని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సి పి ఓ శ్రీనివాస్ నాయక్ ,జిల్లా అధికారులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
