నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి. మే 9 (డిగ్నిటీ న్యూస్): యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్. బి చంద్రశేఖర్ అన్నారు. దేవరకొండ నియోజక వర్గ పరిధిలో 15 రోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు పూర్తి చేయాలని చెప్పారు.

శనివారం దేవరకొండ ఆర్డీవో కార్యాలయంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్,. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ తో కలిసి డివిజన్ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.జిల్లాలో ఇప్పటివరకు 457 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. మొత్తం 6.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందని ముందస్తు అంచనా వేసినట్లు పేర్కొన్నారు. మిగిలిపోయిన ధాన్యం కొనుగోళ్లు వచ్చే 15 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. దేవరకొండ డివిజన్ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో మిల్లర్ల సమన్వయం ద్వారా ధాన్యం వేగంగా మిల్లులకు తరలించే చర్యలు చేపడుతున్నామని తెలిపారు. అవసరమైన చోట హమాలీల సంఖ్యను పెంచడంతో పాటు, అదనంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యం కళ్లాల్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా త్వరితగతిన తరలింపు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ధాన్యం అమ్మిన రైతులకు చెల్లింపులు సకాలంలో జరుగుతున్నాయని, ఇప్పటివరకు రూ487 కోట్లు చెల్లించామని తెలిపారు. డివిజన్ పరిధిలోని 12 మిల్లులకు చెందిన మిల్లర్లు ధాన్యం సేకరణలో పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ధాన్యాన్ని త్వరితగతిన మిల్లులకు తరలించాలని పేర్కొంటూ అదనంగా 30 లారీలను పెంచామని, ప్రస్తుతం మొత్తం 100 లారీలతో 24 గంటల వ్యవధిలో ధాన్యం అన్‌లోడింగ్ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ మాట్లాడుతూ రైతు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని,ఒక వేళ వర్షానికి ధాన్యం తడిచినా కొంటుందని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గానికి ఈసారి సుమారు 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ఇప్పటివరకు 20 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని తెలిపారు. డిండి ప్రాంతంలో ఇంకా వరి కోతలు కొనసాగుతున్నాయని, అక్కడినుండి వచ్చే ధాన్యం కొనుగోలుకు అనుగుణంగా కలెక్టర్, జేసీ ఆధ్వర్యంలో చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.నియోజకవర్గంలోని 12 మిల్లుల మిల్లర్లు ధాన్యం స్వీకరణలో భాగస్వామ్యం కావాలని కోరారు.ప్రస్తుతం ఉన్న 70 లారీలు సరిపోకపోతే మరిన్ని లారీలు కూడా అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ఏ కేంద్రంలో ధాన్యం ఎక్కువగా ఉంటే అక్కడికి వెంటనే లారీలు పంపిస్తామని చెప్పారు. వచ్చే పది రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చిత్తశుద్ధితో పనిచేస్తోందని. మిల్లర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే ప్రతి గింజ కొనుగోలు చేసి రైతులను ఆదుకోవచ్చని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ సమీక్ష సమావేశంలో దేవరకొండ ఇంచార్జ్ ఆర్డిఓ రమణారెడ్డి ,డిఎస్ఓ వెంకటేష్, డిఎం రాంపత్తి నాయక్, డిసిఓ పత్యా నాయక్ , మార్కెటింగ్ ఏడి ఛాయాదేవి, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, డిటి ముబీన్,రైస్ మిల్లర్ల తరఫున వెంకన్న, శ్రీనివాస్,అధికారులు,తదితరులు హాజరయ్యారు.
