జనగణనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్

నల్గొండ, మే (డిగ్నిటి న్యూస్): దేశ ప్రణాళికా రచన, భవిష్యత్తు అభివృద్ధిలో కీలకమైన 2027 జనగణన ప్రక్రియలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నల్గొండలో మున్సిపల్ కార్పొరేషన్, ప్రణాళికా విభాగం సంయుక్తంగా నిర్వహించిన ‘జనగణన నడక’ను మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా క్లాక్ టవర్ వద్ద జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 10వ తేదీ వరకు మాత్రమే స్వీయ గణనకు అవకాశం ఉందని, మొబైల్ ద్వారా 16 భాషల్లో సులభంగా వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. గృహస్తులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవడం వల్ల ఎన్యుమరేటర్లు వచ్చినప్పుడు సమయం ఆదా అవుతుందని, తద్వారా పారదర్శకమైన గణన సాధ్యమవుతుందని పేర్కొన్నారు.జిల్లాలో సుమారు 20 లక్షల జనాభా, 5.50 లక్షల ఇళ్లు ఉండగా, ఇప్పటివరకు కేవలం 12 వేల కుటుంబాలు మాత్రమే స్వీయ గణన చేసుకున్నాయని, మిగిలిన వారు ఈ రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. అద్దె ఇళ్లలో ఉండేవారు సైతం ప్రస్తుతం నివసిస్తున్న చోట నుండే వివరాలు ఇవ్వవచ్చని, ఈ సమాచారం కేవలం జనాభా లెక్కలకు మాత్రమే వినియోగిస్తామని స్పష్టం చేశారు. మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కేవలం పది నిమిషాల సమయం కేటాయించడం ద్వారా అభివృద్ధిలో పౌరులు తమ వంతు పాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, సీపీఓ శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Translate »