RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

చుక్కల భూమి క్రమబద్ధీకరణకు రూ. 50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనం

ఏసీబీ వలలో బనగానపల్లె తహశీల్దార్‌, సర్వేయర్‌

బనగానపల్లె, మే 5 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): అవినీతి రహిత పాలన అందించాలన్న ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కి, రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని అందినకాడికి దండుకుంటున్న అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) పంజా విసిరింది. చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చేందుకు లంచం డిమాండ్‌ చేసిన బనగానపల్లె తహశీల్దార్‌ రాజీవ్‌ రెడ్డి, మండల సర్వేయర్‌ హుస్సేన్‌ బాషాను ఏసీబీ అధికారులు సోమవారం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

పథకం ప్రకారమే వేట:

బనగానపల్లె పట్టణానికి చెందిన గడ్డం నాగేశ్వర రెడ్డికి సర్వే నంబరు 121లో చుక్కల భూమి ఉంది. దీనిని పట్టా భూమిగా మార్చుకునేందుకు ఆయన మండల సర్వేయర్‌ హుస్సేన్‌ బాషాను ఆశ్రయించగా, పని పూర్తి చేసేందుకు రూ. 1.50 లక్షలు డిమాండ్‌ చేశారు. బాధితుడు తన గోడు వెళ్లబోసుకోవడంతో చివరకు తహశీల్దార్‌ రాజీవ్‌ రెడ్డి సమక్షంలో రూ. 80 వేలకు బేరం కుదిరింది. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ. 50 వేలను సోమవారం స్థానిక విద్యుత్ కార్యాలయం సమీపంలో సర్వేయర్‌కు ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ నాగ సోమన్న తన బృందంతో కలిసి దాడి చేసి పట్టుకున్నారు.

తహశీల్దార్‌ పాత్ర నిర్ధారణ:

సర్వేయర్‌ దొరికిన వెంటనే ఏసీబీ అధికారులు చాకచక్యంగా వ్యవహరించారు. నిందితుడితో తహశీల్దార్‌కు ఫోన్‌ చేయించగా, ఆ డబ్బు తీసుకుని కార్యాలయానికి రావాలని ఆయన సూచించారు. దీంతో సర్వేయర్‌తో పాటు తహశీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిన అధికారులు, అక్కడ తహశీల్దార్‌ రాజీవ్‌ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ నిమిత్తం కర్నూలు ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు.

చర్చనీయాంశంగా అవినీతి పర్వం:

తహశీల్దార్‌ రాజీవ్‌ రెడ్డి గతంలో కలెక్టరేట్‌లో సీసీగా పనిచేసిన సమయంలోనూ పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నట్లు సమాచారం. బనగానపల్లె తహశీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఆయన పెద్ద ఎత్తున వసూళ్లకు పాల్పడ్డారని, ఇప్పటివరకు సుమారు కోటి రూపాయల వరకు రైతుల నుంచి వసూలు చేశారన్న ఆరోపణలు నియోజకవర్గంలో బలంగా వినిపిస్తున్నాయి. బాధ్యతలు చేపట్టిన అతి తక్కువ కాలంలోనే ఏసీబీకి చిక్కడం రెవెన్యూ వర్గాల్లో కలకలం రేపుతోంది.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully