ఖాకీలపై కారం చల్లి దాడి

చిత్తలూరులో గోడ వివాదం ఉద్రిక్తత.. కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలు

శాలిగౌరారం/నల్లగొండ, మే 4 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): రెండు వర్గాల మధ్య నెలకొన్న సామాన్య గోడ వివాదం చివరకు విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి దారితీసిన ఘటన శాలిగౌరారం మండలం చిత్తలూరులో కలకలం రేపింది. శాంతిభద్రతలను పర్యవేక్షించేందుకు వెళ్లిన పోలీసుల కళ్లలో కారం చల్లి, రాళ్లతో దాడి చేయడంతో ఒక కానిస్టేబుల్ తల పగిలి తీవ్ర రక్తస్రావమైంది. గ్రామంలోని రెండు వర్గాల మధ్య కొంతకాలంగా గోడ నిర్మాణం విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే శనివారం ఇరువర్గాలు మరోసారి ఘర్షణకు దిగడంతో స్థానికులు ‘డయల్ 100’కు సమాచారం అందించారు. రంగ ప్రవేశం చేసిన పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఇరు పక్షాలతో మాట్లాడుతున్న సమయంలోనే ఒక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయారు. పక్కా పథకం ప్రకారం పోలీసుల కళ్లలో కారం పొడి చల్లి, చేతికి దొరికిన రాళ్లతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు.ఈ అకస్మాత్తు దాడిలో ఒక కానిస్టేబుల్‌ తలకు బలమైన గాయం తగలడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. గమనించిన సహచర సిబ్బంది వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, నిందితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నంలో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తాము చేసిన దాడిని కప్పిపుచ్చుకునేందుకు నిందితులు వింత వాదనను తెరపైకి తెచ్చారు. పోలీసులు తమపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నారంటూ కేకలు వేస్తూ హంగామా సృష్టించారు.ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించడమే కాకుండా, పోలీసులపైనే భౌతిక దాడికి పాల్పడటాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనకు బాధ్యులైన సురేష్, వెంకన్న, విఠల్‌లపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం గ్రామంలో భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ, గ్రామస్తులు మాత్రం భయాందోళనలో ఉన్నారు.

Translate »