
నంద్యాల, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): అనంతపురంలో విలేకరిపై మనీషా నాయర్ సాగించిన అరాచక పర్వంపై నంద్యాల పాత్రికేయ లోకం భగ్గుమంది. సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన నాలుగో స్తంభాన్ని నిలువునా వణికించిన తీరును నంద్యాల పాత్రికేయులు సి.ఎం. నాగేంద్ర, హనుమతులు తీవ్రంగా ఖండించారు. అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం నాడే జర్నలిస్టుల బతుకులు వీధిన పడటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని వారు మండిపడ్డారు.ఒక కాలేజీని నడుపుతూ విద్యావంతురాలిగా చెలామణి అవుతున్న మహిళ, చట్టంపై కనీస గౌరవం లేకుండా బజారు రౌడీలా ప్రవర్తించడం సభ్యసమాజాన్ని విస్మయానికి గురిచేస్తోందని వారు విమర్శించారు. విలేకరి రాసిన వార్తలో తప్పుంటే న్యాయపరంగా ఎదుర్కోవాలే తప్ప, ఇంటిపైకి వెళ్లడం, కాలర్ పట్టుకుని లాగడం, కాళ్లు పట్టించుకుని వీడియోలు తీయడం వంటి చర్యలు ఆమె వికృత మనస్తత్వానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ప్రెస్ క్లబ్ వంటి పవిత్ర సంస్థలపై దాడి చేయడం అంటే జర్నలిస్టుల ఆత్మగౌరవంపై దాడి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.యాజమాన్యాల ఆదేశాలతో పనిచేసే క్షేత్రస్థాయి విలేకరులు బలిపశువులుగా మారుతుంటే చూస్తూ ఊరుకోబోమని వారు స్పష్టం చేశారు. చిత్తూరులో విలేకరి రక్తం ఇంకా ఆరకముందే అనంతపురంలో ఇలాంటి దుశ్చర్యలు చోటుచేసుకోవడం జర్నలిస్టుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం జర్నలిస్టులే కాకుండా పౌర సమాజం కూడా ఈ అరాచకాన్ని వ్యతిరేకించాలని వారు పిలుపునిచ్చారు. ఇలాంటి శక్తులకు అడ్డుకట్ట వేయకపోతే రేపు సామాన్యుడి గొంతు కూడా నొక్కే ప్రమాదం ఉందని నాగేంద్ర, హనుమతులు హెచ్చరించారు. ఈ ఘటనపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
