RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

మా జోలికి వస్తే రాజకీయ సమాధి కడతాం!

కోమటిరెడ్డి సోదరులపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు సంచలన వ్యాఖ్యలు

​సూర్యాపేట/తుంగతుర్తి, జూలై 24 (డిగ్నిటి న్యూస్): ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. నల్గొండ జిల్లా రాజకీయాల్లో ప్రముఖులైన మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిల తీరుపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన నియోజకవర్గంపై అనవసర జోక్యం చేసుకుంటూ తమ గౌరవానికి భంగం కలిగిస్తున్నారని, తమ జోలికి వస్తే ఊరుకునేది లేదని, పొలిటికల్ సమాధికి డప్పులు కొడతామని హెచ్చరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

​స్థానిక ఎమ్మెల్యే ఉన్నాననే సోయి లేకుండా, కనీస సమాచారం ఇవ్వకుండా, ప్రోటోకాల్ పాటించకుండా తన నియోజకవర్గానికి మంత్రి వెంకటరెడ్డి ఎలా వస్తారని మందుల సామేలు నిలదీశారు. మోత్కూరులో రోడ్డు నిర్మాణం కోసం అనేకసార్లు చుట్టూ తిరిగినా పట్టించుకోని మంత్రి, ఇప్పుడు ఉన్నఫళంగా పర్యటనలు చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటని ప్రశ్నించారు. ఎస్సీ నియోజకవర్గం అంటే కొందరికి హంకారం పెరిగిపోయిందని, మాదిగ సామాజిక వర్గం మీకు బానిసల్లా కనిపిస్తుందా అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే అంతకంత ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేశారు.
​అంతేకాకుండా, జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ కార్యకర్తలను, పార్టీ వాతావరణాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని దుయ్యబట్టారు. మండల అధ్యక్షుల నియామక ప్రక్రియపై కూడా స్పందిస్తూ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఖరారు చేసిన బాధ్యులే కొనసాగుతారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గాల సరిహద్దులు దాటి తమపై కామెంట్లు చేస్తున్న రాజగోపాల్ రెడ్డి, వెంకటరెడ్డిల వైఖరిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు వెంటనే జోక్యం చేసుకుని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలో స్వార్థ రాజకీయాల కోసం పార్టీని బలిచేసే ప్రయత్నాలను పార్టీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణించాలని ఆయన కోరారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully