- హైదరాబాద్ – విజయవాడ రహదారిపై కారును ఢీకొట్టిన ప్రైవేటు బస్సు
- మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు.. బ్యాంక్ ఉద్యోగికి తీవ్ర గాయాలు
నల్గొండ జిల్లా చిట్యాల, జూలై 05 (డిగ్నిటి న్యూస్): నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ శివారులో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న కారును ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అత్యంత బలంగా ఢీకొట్టింది.

ఈ భీకర ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారు నడుపుతున్న ఎస్‌బీఐ ఉద్యోగి ప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లాకు చెందిన వారిగా, ప్రస్తుతం హైదరాబాద్‌లోని కొంపల్లిలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్‌బీఐ ఉద్యోగి ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో కలిసి చెన్నై నుంచి కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. కారు పెద్దకాపర్తి సమీపంలోకి రాగానే, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ప్రైవేట్ బస్సు దాన్ని బలంగా ఢీకొట్టింది. ప్రమాద ధాటికి కారు పూర్తిగా ధ్వంసం కాగా.. ప్రసాద్ భార్య, కుమార్తె (15), కుమారుడు (10) తో పాటు ఆయన స్నేహితుడు శ్రీకర ప్రసాద్ (62) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ప్రసాద్‌ను స్థానికులు, పోలీసులు చికిత్స నిమిత్తం తక్షణమే ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో, పోలీసులు క్రేన్ సహాయంతో ధ్వంసమైన కారును పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర విషాదం నెలకొంది.

