- కొలిమిగుండ్లలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది భారీ అవగాహన ర్యాలీ
కొలిమిగుండ్ల, జూన్ 27 (డిగ్నిటి న్యూస్): మండల పరిధిలో ఐదేళ్ల లోపు వయసున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పిలుపునిచ్చారు. జాతీయ పల్స్ పోలియో నిర్మూలనా కార్యక్రమంలో భాగంగా ఆదివారం (జూన్ 28) నిర్వహించనున్న పోలియో చుక్కల కార్యక్రమంపై శనివారం కొలిమిగుండ్లలో ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆరోగ్య కేంద్రం పరిసరాల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో సిబ్బంది పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నినాదాలు చేశారు.ఈ సందర్భంగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మాట్లాడుతూ ఆదివారం ఉదయం 6:00 గంటల నుంచే మండలంలోని అన్ని ప్రభుత్వ కేంద్రాలు, కేటాయించిన బూత్‌లలో పోలియో చుక్కల పంపిణీ ప్రారంభమవుతుందని తెలిపారు. పుట్టిన బిడ్డ నుంచి ఐదేళ్ల లోపు వయసు కలిగిన ప్రతి చిన్నారికీ ఈ చుక్కలు వేయించడం తల్లిదండ్రుల బాధ్యతని గుర్తుచేశారు. గతంలో పోలియో చుక్కలు వేయించినప్పటికీ, ఈ విడతలో మళ్లీ తప్పనిసరిగా వేయించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డాక్టర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

