RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

విద్యా సమస్యలు పట్టవా?.. మంత్రి లోకేష్‌పై పిడిఎస్‌యూ నిప్పులు

  • నంద్యాల పద్మావతి నగర్ ఆర్చ్ వద్ద విద్యార్థుల భారీ ర్యాలీ, ధర్నా.. విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్

నంద్యాల, జూన్ 25 (డిగ్నిటి న్యూస్): రాష్ట్రంలో విద్యా రంగ సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పిడిఎస్‌యూ (ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్) నాయకులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. నంద్యాల కేంద్రంలోని పద్మావతి నగర్ ఆర్చి వద్ద పిడిఎస్‌యూ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యా రంగ సమస్యలపై విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు.ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి పిడిఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ మాట్లాడుతూ, విద్యా హక్కు చట్టం-2009 మరియు కొఠారి కమిషన్ సిఫార్సులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. జీడీపీలో 6 శాతం, కేంద్ర బడ్జెట్‌లో 20 శాతం, రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులను విద్యారంగానికి కేటాయించాల్సి ఉన్నా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో జీవో నంబర్ 3 రద్దు వల్ల అక్కడి విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని, ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రత్యేక డీఎస్సీని నిర్వహించాలని కోరారు.అదేవిధంగా యువగళం పాదయాత్ర సాక్షిగా తాము అధికారంలోకి వస్తే జీవో నెంబర్ 75 రద్దు చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారని, కానీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా దానిపై స్పష్టత లేదని విమర్శించారు. అంతేకాకుండా రాష్ట్రంలో విద్యారంగానికి సంబంధించిన రూ. 6,400 కోట్ల బకాయిలను విడుదల చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలను పెంచడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఒక హాస్టల్ విద్యార్థికి రోజుకు కేవలం రూ. 55 కేటాయిస్తుంటే, ఖైదీలకు మాత్రం రోజుకు రూ. 100 చొప్పున ఇస్తున్నారని.. విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని విమర్శించారు.రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ పాఠశాలలు, కాలేజీలు ఫీజుల పేరిట, యూనిఫామ్‌లు, పుస్తకాలు, ట్రస్ట్‌ల పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుండి వేలాది రూపాయలు దోచుకుంటున్నా కూటమి ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళనాడులో ముఖ్యమంత్రి అమలు చేసిన జీవో నెంబర్ 199 వంటి సంస్కరణలను ఇక్కడెందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. విద్యాసంస్థలను నడిపే కార్పొరేట్ శక్తులకు, మంత్రులకే విద్యాశాఖ బాధ్యతలు అప్పజెప్పడంతో ప్రభుత్వ పాఠశాలలు నిర్వీర్యమవుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై 20 రోజులు గడుస్తున్నా.. నేటికీ సగానికి పైగా పాఠశాలల్లో కనీసం పాఠ్యపుస్తకాలు కూడా అందలేదని, ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.విద్యార్థుల న్యాయమైన సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించకుంటే రాబోయే రోజుల్లో విద్యార్థులందరినీ ఐక్యం చేసి, ‘అసెంబ్లీ ముట్టడి’ చేపట్టి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

అనంతరం పిడిఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింహాద్రి కిరణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో విద్యావ్యవస్థ అతలాకుతలమవుతుంటే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థలు ఎటువంటి లేకుండానే జేఈఈ, నీట్, ఐఐటీ, ఒలింపియాడ్, ఇంటర్నేషనల్ కోర్సుల పేరుతో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులను నిలువునా దోచుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్ లేని బస్సులు నడుపుతూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్‌ను ఏదైనా అంటే తాను ఊరుకోనని, తనను అంటే పవన్ ఊరుకోడంటూ లోకేష్ సొల్లు కబుర్లు చెబుతున్నారే తప్ప, అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా విద్యార్థులకు ఏం చేశారో సమాధానం చెప్పాలన్నారు.రాష్ట్రంలోని నక్కపల్లి, దేవరపల్లి, వైజాగ్, గుంటూరు తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ హాస్టళ్లలో నాణ్యత లేని ఆహారం వల్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నా మంత్రి గానీ, అధికారులు గానీ కనీసం పరిశీలించలేదని కిరణ్ కుమార్ ఆరోపించారు. హాస్టళ్లలో విద్యార్థుల మెస్ ఛార్జీల కోసం కేటాయించే రూ.33 లలో రూ.10 అధికారులు లంచాల రూపంలో నొక్కుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సమస్యలపై చర్చించే దమ్ముంటే విజయవాడ సెంటర్‌కు రావాలని, పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రైవేట్ సైన్యంలా వ్యవహరించడం సరికాదని హితవు పారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించలేని పక్షంలో నారా లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి విద్యార్థి లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యూ జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully