రూ.450 కోట్లతో ఎస్‌ఎల్‌బీసీ కాల్వ లైనింగ్ పనులు

ఈ నెల 17న సీఎం రేవంత్‌రెడ్డి నల్లగొండ పర్యటన: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 11 (డిగ్నిటీ న్యూస్): నల్లగొండ మండలం గుండ్లపల్లి గ్రామ సమీపంలో రూ.450 కోట్లతో కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ కాల్వ లైనింగ్ పనులను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిని సమీక్షించిన మంత్రి, నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆధునీకరణ పనుల వల్ల చివరి ఆయకట్టు భూముల వరకు సాగునీరు అందుతుందని, తద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ రంగాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ గంగం శ్రీనివాసరెడ్డి, ఎస్ఈ బద్రు నాయక్, ఇతర అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో కలెక్టర్ బి.చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌లతో కలిసి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.14,500 కోట్ల వ్యయంతో చేపట్టనున్న హ్యాం (HAM) రోడ్ల శంకుస్థాపన కోసం ఈ నెల 17న ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌రెడ్డి కనగల్ వస్తున్నట్లు మంత్రి తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి బహిరంగ సభ వేదిక, పైలాన్ ఏర్పాటు, గట్టి బందోబస్తు తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. వీలైతే అదే రోజున ధర్వేశిపురం రేణుక ఎల్లమ్మ ఆలయ ఆధునీకరణ పనులకు కూడా సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయించేందుకు ప్రయత్నిస్తామన్నారు. సభకు వచ్చే ప్రజలకు తాగునీరు, నీడ వంటి అన్ని వసతులు కల్పించాలని మంత్రి సూచించారు. కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఇప్పటికే తాము కనగల్‌లో సభ స్థలిని పరిశీలించామని, అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాట్లను పూర్తి చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, వై. అశోక్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *