వికలాంగులకు రూ.15 వేల పింఛన్‌ మంజూరు చేయాలి

వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శీలం శ్రీనివాసులు

నంద్యాల, జూన్ 8 (డిగ్నిటి న్యూస్): అర్హులైన వికలాంగులందరికీ ఎన్టీఆర్ భరోసా పథకం కింద నెలకు రూ.15 వేల పింఛన్‌ను తక్షణమే మంజూరు చేయాలని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శీలం శ్రీనివాసులు డిమాండ్ చేశారు. సోమవారం నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆ సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా కలెక్టరేట్ లో కలెక్టర్ రాజకుమారి గనియాను కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.అనంతరం శీలం శ్రీనివాసులు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం వికలాంగుల అభివృద్ధి, సంక్షేమం కొరకు ఎంతో కృషి చేస్తోందని కొనియాడారు. అయితే, నకిలీ వికలాంగుల ఏరివేత పింఛన్ల కార్యక్రమంలో భాగంగా క్షేత్రస్థాయిలో కొంతమంది అధికారుల నిర్లక్ష్య వైఖరి వల్ల అర్హులైన దివ్యాంగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మంచానికే పరిమితమై, వీల్ చైర్ల ద్వారా జీవనం సాగిస్తున్న నిజమైన బాధితులకు పింఛన్లు అందకుండా పోతున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి, క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి పరిశీలన జరిపి నిజమైన అర్హులకు రూ.15 వేల పింఛన్‌ అందేలా చూడాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో డోన్ నియోజకవర్గం నుంచి మధుబాబు, రామకృష్ణారెడ్డి, ఆళ్లగడ్డ నుంచి మద్దిలేటి, శ్రీశైలం నుంచి జిలాని, నందికొట్కూరు నుంచి శీలం శ్రీనివాస్, ఆత్మకూరు నుంచి బాషా తదితర వికలాంగుల సంఘాల ప్రతినిధులు, బాధితులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *