రైతులందరికీ విశిష్ట సేవా సంఖ్య తప్పనిసరి

ఖరీఫ్ సన్నాహకాలపై వ్యవసాయ సిబ్బంది, డీలర్ల సమావేశం

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

నంద్యాల, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): నంద్యాల సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయ సిబ్బంది, ఇన్‌పుట్ డీలర్లకు ఖరీఫ్ సన్నాహకాలపై శనివారం జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున, అందుకు అనుగుణంగా రైతులు పంటలు, రకాలు ఎంపిక చేసుకునేలా గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు.

పీఎం కిసాన్, పంటల బీమా, వడ్డీ రాయితీ, పెట్టుబడి సాయం వంటి ప్రభుత్వ సేవలు పొందడానికి ప్రతి రైతుకూ ‘విశిష్ట సేవా సంఖ్య’ తప్పనిసరి అని, దీని ప్రాముఖ్యతను వివరించాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ఈ ఖరీఫ్ నుంచి యూరియా, డీఏపీ ఎరువులను ‘ఏపీఏఐఎంఎస్’ యాప్ ద్వారానే పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.

అనంతరం ఉప వ్యవసాయ సంచాలకులు గంగాధర్ రావు మాట్లాడుతూ ఇన్‌పుట్ డీలర్లు చట్టాలకు లోబడి వ్యాపారం చేయాలని, రోజూ స్టాక్ బోర్డు, ధరల పట్టిక ప్రదర్శించాలన్నారు. ఎంఆర్‌పీ ధరల కంటే ఎక్కువకు అమ్మినా, ఈ-పాస్, స్టాక్ రిజిస్టర్లలో వ్యత్యాసాలు ఉన్నా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏడీఏ జయప్రకాష్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారులు ప్రసాద రావు, నాగేశ్వర రెడ్డి, సుబ్బా రెడ్డి, పవన్, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *