వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి చిక్కాడు

మసీదు భూమి నివేదిక కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ దొరికిపోయిన వైనం

మిర్యాలగూడ బస్టాండ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు

మిర్యాలగూడ, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): మసీదుకు సంబంధించిన భూమి రికార్డులను ఉన్నతాధికారులకు పంపేందుకు లంచం డిమాండ్ చేసిన నల్లగొండ జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ మహమూద్ ఏసీబీ అధికారులకు చిక్కాడు. మిర్యాలగూడ బస్టాండ్ ప్రాంగణంలో శనివారం బాధితుడి నుంచి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

రిపోర్టు ఇవ్వకుండా వేధింపులు
ఏసీబీ డీఎస్పీ జగదీష్ చంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దవూర మండల కేంద్రంలో సుమారు 900 గజాల స్థలంలో ఒక మసీదు, దానికి అనుకుని ఖాళీ స్థలం ఉంది. దాతలు ఇచ్చిన ఈ స్థలానికి సంబంధించి కొంతకాలంగా వివాదం నడుస్తుండటంతో, దీనిని పూర్తిగా వక్ఫ్ బోర్డు పరిధిలోకి తీసుకోవాలని మసీదు కమిటీ ప్రతినిధులు గతేడాది ఫిబ్రవరిలో వక్ఫ్ బోర్డు సీఈవోకు వినతిపత్రం సమర్పించారు. సీఈవో ఆదేశాల మేరకు ఇన్స్పెక్టర్ మహమూద్ క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి చేసినప్పటికీ, ఉన్నతాధికారులకు పంపాల్సిన అధికారిక నివేదికను తన వద్దే తొక్కిపెట్టాడు. ఆ రిపోర్టును సీఈవో కార్యాలయానికి పంపించాలంటే రూ.10 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో విసిగిపోయిన బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

బస్టాండ్‌లో పక్కా స్కెచ్
బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ బృందం పక్కా వ్యూహం రచించింది. శనివారం నిందితుడు మహమూద్ సూచన మేరకు మిర్యాలగూడ బస్టాండ్ వద్దకు బాధితుడు చేరుకున్నాడు. అక్కడ బాధితుడి నుంచి రసాయనాలు పూసిన రూ.10 వేల నగదును ఇన్స్పెక్టర్ తీసుకుంటుండగా, అప్పటికే నిఘా ఉంచిన ఏసీబీ అధికారులు మెరుపువేగంతో దాడి చేసి పట్టుకున్నారు. అనంతరం ఆయన చేతులకు కెమికల్ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది.

ఇల్లు, కార్యాలయంలో ముమ్మర సోదాలు
ఇన్స్పెక్టర్ మహమూద్‌ను అదుపులోకి తీసుకున్న అనంతరం ఏసీబీ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒక బృందం నల్లగొండ కలెక్టరేట్ సముదాయంలోని వక్ఫ్ బోర్డు కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక రికార్డులను స్వాధీనం చేసుకోగా, మరో ప్రత్యేక బృందం మిర్యాలగూడలోని నిందితుడి నివాసంలో తనిఖీలు చేపట్టింది. లంచం తీసుకుంటూ దొరికిపోయిన మహమూద్‌పై కేసు నమోదు చేశామని, సాక్ష్యాధారాలతో సహా ఆయనను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ వెల్లడించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా వెంటనే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్‌కు సమాచారం అందించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *