RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ఘాట్ రోడ్డు పేరిట గుప్త నిధుల తవ్వకాలు జరుపుతున్నారా..?

– మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి

నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, జూన్ 6 (డిగ్నిటి న్యూస్): నల్లగొండ పట్టణంలోని బ్రహ్మంగారి గుట్ట, లతీఫ్ సాబ్ గుట్టలపై ఘాట్ రోడ్డు నిర్మాణం కోసం నిన్న సాయంత్రం ముందస్తు సమాచారం లేకుండా జరిపిన భారీ పేలుళ్లపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్లాస్టింగ్‌ల కారణంగా మునుగోడు రోడ్ హౌసింగ్ కాలనీలోని ఇళ్లపై పెద్ద పెద్ద బండరాళ్లు పడి స్లాబ్‌లు, రేకులు ధ్వంసమయ్యాయని, స్థానికులు ప్రాణభయంతో రాత్రంతా ఇళ్లు విడిచి బంధువుల ఇళ్లలో తలదాచుకున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత ప్రజలను పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఘాట్ రోడ్డు పేరుతో ఏకంగా 20 మీటర్ల లోతు తవ్వడం చూస్తుంటే గుప్త నిధుల కోసమేననే అనుమానం కలుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నట్లు పేర్కొన్నారు. అసలు ఈ పనులకు సంబంధించిన డీపీఆర్ ఎస్టిమేషన్లు, టెండర్ ప్రక్రియలు జరిగాయా లేదా అని అధికారులను ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా నివాస ప్రాంతాల వద్ద ఓపెన్ బ్లాస్టింగ్ ఎలా అనుమతిస్తారని, ప్రమాదం జరిగి ఉంటే ఎవరు బాధ్యత వహించేవారని నిలదీశారు. కాంగ్రెస్ నాయకుల జేబులు నింపేందుకే అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో తాము నగర అభివృద్ధి కోసం మంజూరు చేయించిన నిధులను సైతం కాంగ్రెస్ నాయకుల వెంచర్లు ఉన్న ప్రాంతాలకు మళ్లించి నాణ్యత లేని పనులు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయి విచారణ జరపాలని, పేలుళ్ల వల్ల నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందించి బాధ్యుడైన కాంట్రాక్టర్‌పై కేసు నమోదు చేయాలని కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

Chintha Yadaiah
Chintha Yadaiah
Reporter
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully