నంద్యాల, జూలై 1 (డిగ్నిటి న్యూస్): మూడు రాజధానుల పేరుతో వైజాగ్ లో రూ.500 కోట్ల ప్రజాధనాన్ని వైసీపీ ప్రభుత్వం వృధా చేసిందని, ఇప్పుడు అక్కడ వద్దని వాళ్లే చెబుతున్నారని ఎంపీ బాలశౌరి విమర్శించారు. బుధవారం నంద్యాలలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతిని రాజధానిగా పార్లమెంట్ లో చట్టం చేశారని, వైసీపీ ముందుగా చట్టాన్ని గౌరవించడం నేర్చుకోవాలని హితవు పలికారు. కూటమి ప్రభుత్వం చట్టప్రకారం వెళుతుంది కాబట్టే సాయికృష్ణ మృతిపై సీఐ నాగరాజును, ఇద్దరు పోలీసులను అరెస్ట్ చేసిందని స్పష్టం చేశారు. చట్టాన్ని అమలు చేయగానే గగ్గోలు పెట్టడం వైసీపీకి అలవాటుగా మారిందన్నారు. కులాల మధ్య వైసీపీ పెట్టే కుట్రలను పసిగట్టి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజలకు అర్థమయ్యేలా చెబుతున్నందుకే వారికి కడుపుమంటగా ఉందని బాలశౌరి మండిపడ్డారు.
