RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

ఉద్యోగులపై పని ఒత్తిడి తగ్గించాలి

వీఆర్‌వో హుస్సేన్‌ ఆత్మహత్యకు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి: ఏపీజీఈఏ నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప

నంద్యాల, జూన్ 11 (డిగ్నిటి న్యూస్): రాష్ట్రంలో విధులు నిర్వహిస్తున్న వీఆర్‌వోలు, విలేజ్ సర్వేయర్లు, వీఆర్‌ఏలపై అధికారులు అదనపు పనుల పేరిట తీవ్ర పని ఒత్తిడి పెంచుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) నంద్యాల జిల్లా అధ్యక్షుడు నాగేంద్రప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కర్నూలు జిల్లా వెంకయ్యపల్లెకు చెందిన వీఆర్‌వో మహమ్మద్ హుస్సేన్ అనారోగ్య కారణాల వల్ల బీఎల్‌వో విధుల నుంచి మినహాయింపు కోరినా అధికారులు స్పందించకపోవడంతో, తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం అత్యంత విషాదకరమన్నారు. ఆయన మృతికి కారణమైన అధికారులపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, రెవెన్యూ ఉద్యోగులతో కేవలం రెవెన్యూ శాఖకు సంబంధించిన విధులు మాత్రమే చేయించాలని కోరారు.

ఐవీఆర్‌ఎస్ కాల్స్ ఆధారంగా నేరుగా సస్పెన్షన్లు విధించడం సరికాదని, శాఖాపరమైన విచారణ తర్వాతే చర్యలు ఉండాలని స్పష్టం చేశారు. అలాగే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఖాళీగా ఉన్న పోస్టులను అర్హులైన వీఆర్‌వోలు, వీఆర్‌ఏలకు పదోన్నతుల ద్వారా వెంటనే భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.కాగా, బాధితుడి కుటుంబ పరిస్థితిని వివరించగా సానుకూలంగా స్పందించి, హుస్సేన్ పెద్ద కుమారుడికి కారుణ్య నియామకం కింద జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ నియామక ఉత్తర్వులు, ఇంటి స్థలం పట్టా అందజేసిన కర్నూలు జిల్లా కలెక్టర్‌కు అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ, ఏపీజీఈఏ జిల్లా నేతలు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం హుస్సేన్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో అమరావతి రెవెన్యూ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ భూపతిరాజు రవీంద్రరాజు, ఏపీవీఆర్‌వో సంఘం ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి సర్పరాజు రాగిని, ఏపీజీఈఏ కర్నూలు జిల్లా అధ్యక్షుడు బంగి శ్రీధర్, నేతలు బి.మధుబాబు, ఎం.అప్పలనాయుడు, సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version