891 మంది ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీలపై ‘గ్రీన్ సిగ్నల్’ వచ్చేనా…!?
((డిగ్నిటి న్యూస్) అమరావతి/హైదరాబాద్:)
తెలుగు రాష్ట్రాల విభజన జరిగి దశాబ్దం దాటినా.. ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో మాత్రం ఇంకా విభజన గాయాలు పచ్చిగానే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో మెరిట్ సాధించి, ఉద్యోగాలు సంపాదించి, తెలంగాణ ఉద్యమంలోనూ ముందుండి నడిచిన వందలాది మంది ఉద్యోగులు నేడు కుటుంబాలకు దూరమై తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో పని చేస్తూ శాశ్వత ప్రాతిపదికన తెలంగాణకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసిన 891 మంది ఉద్యోగుల జాబితాను ఏపీ ప్రభుత్వం తెలంగాణకు పంపడం ఒక కీలక పరిణామం. ఏపీ సీఎస్ నుంచి తెలంగాణ సీఎస్‌కు వెళ్లిన ఈ ఫైలుకు ఈసారైనా ‘గ్రీన్ సిగ్నల్’ లభిస్తుందా? లేక గత పదేళ్లుగా జరిగినట్లే మళ్లీ బ్రేకులు పడతాయా? అని ఉద్యోగ కుటుంబాలు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాయి.
విచ్ఛిన్నమవుతున్న కుటుంబ బంధాలు.. వర్ణనాతీతం ఉద్యోగుల బాధలు
ఉద్యోగం ఒకచోట.. వృద్ధ తల్లిదండ్రులు ఒకచోట.. పిల్లల చదువులు ఇంకొకచోట.. ఇలా ముక్కలైపోయిన కుటుంబాలతో ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. శ్రీకాకుళం, చిత్తూరు లాంటి సుదూర ప్రాంతాల్లో ఉంటూ తెలంగాణలో ఉన్న స్వస్థలాలకు రావాలంటే ప్రయాణ భారంతో పాటు వయస్సు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలు వారిని కుంగదీస్తున్నాయి.
- కన్నవారి ఆఖరి చూపునకు నోచుకోని వైనం: “నేను ఇక్కడే పుట్టాను.. ఇక్కడే చస్తాను.. నా చావుకైనా రావయ్యా” అని వృద్ధ తల్లిదండ్రులు స్వస్థలాల నుండి కన్నీరుమున్నీరవుతుంటే, అటు ఉద్యోగాన్ని వదల్లేక, ఇటు కన్నవారిని చూసుకోలేక ఉద్యోగులు కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం అత్యవసర సమయాల్లోనూ, బంధువుల అంత్యక్రియలకు కూడా సకాలంలో చేరుకోలేని భౌగోళిక దూరాలు వారిని వేధిస్తున్నాయి.
- ఆరోగ్య సంక్షోభం: ఒక రాష్ట్రానికి చెందిన హెల్త్ కార్డులు మరో రాష్ట్రంలో పనిచేయకపోవడంతో, అనారోగ్యం బారిన పడినప్పుడు ఆర్థికంగా, వైద్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- పిల్లల భవిష్యత్తుపై ప్రభావం: స్థానికత సమస్యల వల్ల పిల్లల ఉన్నత చదువులకు ఆటంకం కలగడమే కాకుండా, పెళ్లి ఈడుకొచ్చిన పిల్లలకు సంబంధాలు చూసేటప్పుడు “తల్లిదండ్రులు ఆంధ్రాలో ఉంటారు, మాకు పూర్తి వివరాలు తెలియవు” అనే సాకుతో సంబంధాలు తప్పిపోతున్నాయని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రొఫెషనల్ గా సేవలు అందించేందుకు సిద్ధం
ఈ బదిలీల వల్ల తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అదనపు భారం పడదని, దశాబ్ద కాలానికి పైగా వివిధ శాఖల్లో అపారమైన పరిపాలనా అనుభవం సంపాదించిన తాము, తెలంగాణ పునర్నిర్మాణంలో మరింత ప్రొఫెషనల్‌గా, నిబద్ధతతో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. వీరంతా ఉమ్మడి రాష్ట్రంలో అత్యంత ప్రతిభ (మెరిట్) ద్వారా ఎంపికైన వారు కావడం వల్ల, రాష్ట్ర పాలనా యంత్రాంగానికి వీరి అనుభవం మరింత ఊతాన్ని ఇస్తుందే తప్ప భారం కాబోదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రభుత్వాలు మానవీయ కోణంలో ఆలోచించాలి
ఇది కేవలం ఫైళ్ల కదలిక లేదా ఉద్యోగుల బదిలీల వ్యవహారం మాత్రమే కాదు.. దాదాపు 900 కుటుంబాల ఉనికి, భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత సున్నితమైన మానవీయ సమస్య. గతంలో ప్రతిసారీ ఫైలు చివరి దశకు వచ్చి నిలిచిపోయినప్పుడల్లా ఆయా కుటుంబాలు తీవ్ర నిరాశకు గురయ్యాయి.
ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు రాజకీయ, సాంకేతిక అంశాల కంటే.. మానవీయ కోణానికి అగ్రతాంబూలం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏపీ ప్రభుత్వం పంపిన 891 మంది ఉద్యోగుల జాబితాను తెలంగాణ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో, త్వరితగతిన పరిశీలించి సమ్మతి తెలపాలని, ఈ సుదీర్ఘ నిరీక్షణకు మంగళం పాడాలని ఉద్యోగ సంఘాలు, వారి కుటుంబ సభ్యులు రెండు చేతులెత్తి వేడుకుంటున్నారు.
ఈ వార్తా కథనం ఉభయ రాష్ట్రాల పాలకుల మనసులను కరిగించి, ఉద్యోగుల కుటుంబాలలో వెలుగులు నింపుతుందని ఆశిద్దాం... మీ డిగ్నిటి న్యూస్ రామన్న.…
