ఇంట్లో కుళ్లిన స్థితిలో మృతదేహం.. కలకలం రేపిన ఘటన
దేవరకొండ, జూన్ 7 (డిగ్నిటి న్యూస్): స్థానిక గాంధీనగర్‌లో ఒంటరిగా నివసిస్తున్న నాయిని రాజీ రెడ్డి (80) అనే వృద్ధుడు తన నివాసంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రముఖ వ్యక్తి నాయిని ప్రతాప్ రెడ్డి కుమారుడైన రాజీ రెడ్డి సోదరులంతా అమెరికాలో స్థిరపడటంతో ఆయన ఇక్కడే ఒంటరిగా ఉంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఎవరికీ ఫోన్లు ఎత్తకపోవడంతో అనుమానం వచ్చిన బంధువులు ఆదివారం ఇంటికి వచ్చి పరిశీలించారు.
లోపలి నుంచి ఎలాంటి చలనం లేకపోవడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి చూడగా రాజీ రెడ్డి రక్తపు మడుగులో కుళ్లిన స్థితిలో శవమై కనిపించాడు. మృతదేహం పాడైపోవడంతో ఇంట్లోని పెంపుడు కుక్కలు దాన్ని పీకి తిన్నట్లుగా ఉన్న దృశ్యం స్థానికులను తీవ్ర భయాందోళనకు గురిచేసింది. ఆయన కొన్ని రోజుల క్రితమే మరణించి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఇది వృద్ధాప్య సమస్యల వల్ల జరిగిన సహజ మరణమా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
