‘స్పందన’లో రాచమడుగు బ్రదర్స్ వినతి
నంద్యాల, జూన్ 15 (డిగ్నిటి న్యూస్): దశాబ్ద కాలంగా శిథిలావస్థకు చేరి, తీవ్రంగా దెబ్బతిన్న పులిమద్ది బ్రిడ్జిని తక్షణమే పునర్నిర్మించాలని జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు, సుందర్ డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో వారు జనసేన నాయకులతో కలిసి జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ కు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా రాచమడుగు చందు, సుందర్ లు మాట్లాడుతూ.. పులిమద్ది గ్రామానికి చెందిన బ్రిడ్జి పరిస్థితి ప్రస్తుతం అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత పదేళ్లకు పైగా ఈ బ్రిడ్జి ఎలాంటి మరమ్మతులకు నోచుకోకపోవడంతో స్థానిక గ్రామస్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ బ్రిడ్జి చుట్టుపక్కల గ్రామాలకు ముఖ్యమైన కనెక్టివిటీగా ఉందని, ప్రతిరోజూ వేలాది వాహనాలతో పాటు పాఠశాల విద్యార్థులు, వ్యవసాయ కూలీలు దీనిపై నుంచే ప్రయాణిస్తుంటారని గుర్తు చేశారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనల మధ్య రాకపోకలు సాగిస్తున్నారని, అధికారులు స్పందించి బ్రిడ్జి పునర్నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. దీనిపై డిఆర్ఓ సానుకూలంగా స్పందిస్తూ, ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని, త్వరలోనే పనులు చేపడతామని హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు. సమస్య పరిష్కారమయ్యే వరకు జనసేన ప్రజల పక్షాన పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ ప్రధాన సమస్యను రాచమడుగు బ్రదర్స్ చందు, సుందర్ ల దృష్టికి తీసుకువెళ్లిన స్థానిక జనసేన నాయకుడు అశోక్ కూడా అనంతరం మాట్లాడారు.
2010లో వచ్చిన భారీ వరదల కారణంగా పులిమద్ది గ్రామ బ్రిడ్జి జాయింట్లు విడిపోయి, మధ్యలో కుంగిపోయి పూర్తిగా దెబ్బతిందని నాటి చిత్రాలను అధికారులకు చూపిస్తూ వివరించారు. ఈ మార్గం గుండా నంద్యాల, గడివేముల మండలాల పరిధిలోని దాదాపు 30 నుంచి 40 గ్రామాల ప్రజలు, నిత్యం పాఠశాల బస్సులు, ఆటోలు ప్రయాణిస్తుంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత 16 ఏళ్లుగా అధికారులు కేవలం ప్రతిపాదనలకే పరిమితం చేశారని మండిపడ్డారు. రాచమడుగు బ్రదర్స్ చందు, సుందర్ ల సహకారంతో ఈ సమస్యను జిల్లా కలెక్టర్ రాజకుమారి, అలాగే ఎమ్మెల్యే బిసి జనార్దన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లి, కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు త్వరితగతిన ప్రారంభమయ్యేలా నిరంతరం కృషి చేస్తామని అశోక్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాచమడుగు రాంబాబు, ఆళ్లగడ్డ సోషల్ మీడియా కో-ఆర్డినేటర్ జమాల్ బాషా, సిరివెళ్ల నాయకులు పసుపుల నరేంద్ర, చిన్న జనసేన పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
