– తక్షణ చర్యలు తీసుకోవాలని తహశీల్దార్‌కు ఫిర్యాదు
కోవెలకుంట్ల, జూన్ 15 (డిగ్నిటి న్యూస్): కోవెలకుంట్ల పట్టణంలోని రజక ఐక్య సేవాసమితి కో-ఆపరేటివ్ సొసైటీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై రజక సంఘం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం రాత్రి వేళల్లో కొందరు అక్రమార్కులు రజక భూమిలోని మట్టిని తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, దీనిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆల్వకొండ మద్దిలేటి నేతృత్వంలో స్థానిక తహశీల్దార్‌కు ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా ఏపీ రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఆల్వకొండ మద్దిలేటి మాట్లాడుతూ, దశాబ్దాలుగా జుర్రేరు వాగును నమ్ముకుని 360 రజక కుటుంబాలు తమ కులవృత్తిని చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. 2008లో రజకుల భూమిని ఆక్రమించే ప్రయత్నం జరగగా, అప్పటి కలెక్టర్ స్పందించి జుర్రేరు వాగులోని 9.75 ఎకరాల భూమిని రజక ఐక్య సేవాసమితికి కేటాయించారని గుర్తు చేశారు. అటువంటి కీలకమైన భూమిలో నేడు అక్రమ తవ్వకాలు జరగడం విచారకరమని, దీనివల్ల భారీ గుంతలు ఏర్పడి చిన్నపిల్లలు ప్రమాదవశాత్తు అందులో పడి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అక్రమంగా మట్టిని తరలిస్తున్న వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని, ఇప్పటికే ఏర్పడిన గుంతలను వెంటనే పూడ్చివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సంబంధిత రెవెన్యూ, మైనింగ్ అధికారులు వెంటనే స్పందించి, రజకుల జీవనాధారమైన ఈ భూమికి రక్షణ కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక నాయకులు బాలతిమ్మయ్య, కె.నాగశేషు, సుబ్రహ్మణ్యం, తిమ్మయ్య, సుబ్బారాయుడు, మధు తదితరులు పాల్గొన్నారు.
