- వై.కె వర్గం విధానాలు నచ్చకే రాజీనామా : కామ్రేడ్ బి.ఆనంద్
- సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ రఫీ పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం
వెలుగోడు, జూలై 19 (డిగ్నిటి న్యూస్): అఖిల భారత రైతు కూలి సంఘం (AIKMS) జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ B.ఆనంద్ తన అనుచరులతో కలిసి సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గంలో అధికారికంగా చేరారు. వెలుగోడులో ఆదివారం నిర్వహించిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ రఫీ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ కార్యక్రమానికి ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు పి. లజరాస్ హాజరై కామ్రేడ్ ఆనంద్‌కు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా కామ్రేడ్ ఆనంద్ మాట్లాడుతూ, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ వై.కె. వర్గం నంద్యాల జిల్లా కమిటీ అనుసరిస్తున్న విధివిధానాలు, కార్యాచరణ పట్ల తీవ్ర విభేదాలు ఉండటం వల్లే తాను ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు స్పష్టం చేశారు. విప్లవ రాజకీయాలను ప్రజా ఉద్యమాలతో ముడిపెట్టి నిజాయితీగా ముందుకు తీసుకెళ్తున్న చంద్రన్న వర్గం సిద్ధాంతాలు, విధానాలు తనను ఎంతగానో ఆకర్షించాయని చెప్పారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం చంద్రన్న వర్గం ఆధ్వర్యంలో జరిగే ప్రజా పోరాటాల్లో ఇకపై చురుకుగా పాల్గొంటానని, పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన ప్రకటించారు.
న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కామ్రేడ్ రఫీ మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి, రైతులు–కూలీలు ఎదుర్కొంటున్న సవాళ్లపై భవిష్యత్తులో మరింత విస్తృతంగా ఉద్యమాలు నిర్వహించి ప్రజల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారు. ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు పి. లజరాస్ మాట్లాడుతూ, ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసే ప్రతి ఒక్కరినీ తమ పార్టీ సాదరంగా ఆహ్వానిస్తుందని, కామ్రేడ్ ఆనంద్ చేరికతో కార్మిక, రైతు, కూలీ ఉద్యమాలకు కొత్త ఉత్సాహం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆనంద్‌తో పాటు అఖిల భారత రైతు కూలి సంఘం నాయకులు చాంద్ బాషా, రవి, నాగార్జున, ముబారక్, వెంకట, అలాగే ఐఎఫ్టియు నాయకులు శీను, హరి, విష్ణు నాయక్, మల్లికార్జునతో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
