పోక్సో కేసు నిందితుడికి ‘వెలుగు’ నీడలు?
కటకటాల్లో ఏపీఎం.. ఆఫీసులో లీవ్ లెటర్లు!
ఎఫ్ఐఆర్ చేరలేదంటున్న అధికారులు.. వ్యవస్థలపై అనుమానాల మబ్బులు
నంద్యాల, జూన్ 13 (డిగ్నిటి న్యూస్): బాలికపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టై జైలులో ఉన్న ఓ ప్రభుత్వ ఉద్యోగి పేరుతో… ప్రభుత్వ కార్యాలయంలో మాత్రం ‘టైఫాయిడ్ జ్వరం’ పేరుతో మెడికల్ లీవ్ దరఖాస్తు దర్శనమివ్వడం నంద్యాల జిల్లా డీఆర్డీఏ (వెలుగు) విభాగంలో కలకలం రేపుతోంది. వ్యవస్థలను మభ్యపెట్టేందుకు కొందరు చేతులు కలిపారా? లేక విధి నిర్వహణలో నిర్లక్ష్యమే కారణమా? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. డీఆర్డీఏ వెలుగు విభాగంలో ఏరియా ప్రాజెక్ట్ మేనేజర్ (ఏపీఎం)గా పనిచేస్తున్న శ్రీనివాస్‌పై ఓ మైనర్ బాలిక కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. అయితే, ఇదే సమయంలో ఆయన విధులకు హాజరు కాలేకపోతున్నట్లు ‘టైఫాయిడ్ జ్వరం’ కారణంగా మెడికల్ లీవ్ దరఖాస్తు కార్యాలయానికి చేరడం అనేక అనుమానాలకు తావిస్తోంది. నిందితుడు జైలులో ఉన్న సమయంలో అతని భార్య ద్వారా లీవ్ అప్లికేషన్ సమర్పించబడినట్లు తెలిసింది. దానికి అనుబంధంగా ఓ ప్రైవేట్ వైద్యుడు జారీ చేసిన మెడికల్ సర్టిఫికేట్‌ను కూడా జత చేసినట్లు సమాచారం. అయితే, కటకటాల వెనుక ఉన్న వ్యక్తికి బయట చికిత్స అందిందా? లేక వాస్తవాలను దాచిపెట్టేందుకు నకిలీ పత్రాలు వినియోగించారా? అన్న అంశాలపై ప్రజల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మరోవైపు, ప్రభుత్వ ఉద్యోగి అరెస్టుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ సంబంధిత శాఖకు చేరలేదనే అంశం వివాదానికి దారి తీసింది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి అరెస్టు వివరాలు సంబంధిత శాఖాధిపతులకు చేరాల్సి ఉన్నప్పటికీ, ఈ కేసులో అలాంటి సమాచారం అందలేదని వెలుగు పీడీ శ్రీధర్ వెల్లడించినట్లు తెలిసింది. పోలీసుల నుంచి అధికారిక సమాచారం అందకపోవడంతోనే లీవ్ మంజూరు చేసినట్లు ఆయన వివరణ ఇచ్చారు.అయితే, కేసు వివరాలు సంబంధిత శాఖకు చేరకుండా ఆలస్యం జరిగిందా? లేక కావాలనే దాచిపెట్టారనే ఆరోపణల్లో నిజానిజాలేమిటి? అనే దానిపై సమగ్ర విచారణ జరపాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తప్పుడు సమాచారం ఇచ్చి ఉంటే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, మెడికల్ సర్టిఫికేట్ జారీ ప్రక్రియపై కూడా విచారణ జరపాలని కోరుతున్నాయి.ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా మారిన ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సంబంధిత వ్యక్తుల వివరణను కూడా అధికారులు సేకరించి, వాస్తవాలను వెలుగులోకి తేవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
