- స్వయం ఉపాధికి ‘వడ్డీ లేని రుణాలు’!
- ఏ ప్రభుత్వమూ చేయలేని రీతిలో నంద్యాలలో విశేష సేవలు..
- సీనియర్ జర్నలిస్ట్ నూర్ భాష
నంద్యాల, జూలై 24 (డిగ్నిటి న్యూస్):సామాజిక సేవే పరమావధిగా, నిరుపేదలు మరియు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రముఖ వ్యాపారవేత్త, సమాజ సేవకుడు గోళ్ళ రాజేష్ నంద్యాలలో అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆయన ప్రతినిధి, సీనియర్ పాత్రికేయుడు నూర్ భాష కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు, నిరుపేద యువతీ యువకులు సొంత కాళ్లపై నిలబడి స్వయం ఉపాధి పొందేందుకు వీలుగా గోళ్ళ రాజేష్ గురువారం తన కార్యాలయంలో వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమం సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ నూర్ భాష మాట్లాడుతూ.. నేటి కాలంలో ఏ ప్రభుత్వంగానీ, ఏ రాజకీయ నాయకుడు గానీ చేయలేని అత్యుత్తమ సేవలను గోళ్ళ రాజేష్ నిస్వార్థంగా అందిస్తున్నారని తెలిపారు. సాధారణ ప్రజలు ఏదైనా చిన్న వ్యాపారం ప్రారంభించాలంటే బయట రూపాయి, రెండు రూపాయలు మొదలుకొని ఐదు రూపాయల వరకు భారీ వడ్డీలకు అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోందని, వ్యాపారం చేయడం దేవుడెరుగు కానీ ఆ వడ్డీలు కట్టలేక కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పేదల ఈ కష్టాలను స్వయంగా గమనించిన గోళ్ళ రాజేష్, వారంతా సొంత కాళ్లపై నిలబడాలనే దృఢ సంకల్పంతో మొదటి విడతగా 10 మందికి రూ.50,000 చొప్పున వడ్డీ రహిత రుణాలను అందజేసినట్లు వెల్లడించారు. ఈ రుణాలకు ఎలాంటి వడ్డీ ఉండదని, భవిష్యత్తులో ఈ పథకాన్ని మరింత విస్తరించి నిరుద్యోగ యువతకు, పేద వర్గాలకు మరింత చేరువ చేస్తామని స్పష్టం చేశారు.ఇప్పటికే నంద్యాలలో కేవలం ఒక్క రూపాయికే కడుపునిండా భోజనం, చపాతీలు అందిస్తూ వేలాది మంది ఆకలి తీరుస్తున్న గోళ్ళ రాజేష్ సేవలు మరువలేనివని నూర్ భాష గుర్తుచేశారు. కులమతాలకు అతీతంగా దేవాలయాలు, మసీదులు, రాబోయే రోజుల్లో చర్చిల నిర్మాణానికి, అభివృద్ధి కార్యక్రమాలకు తనవంతు ఆర్థిక సహాయం అందిస్తూ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని తెలిపారు.ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ.. తాము ఎందరో రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా దక్కని సహాయం, ఎలాంటి పూచీకత్తులు, సంతకాలు లేదా ఫోటోలు కూడా అడగకుండా దేవుడిలా రాజేష్ అన్న అందించారని ఆనందం వ్యక్తం చేశారు. తమ కుటుంబాలకు కొండంత అండగా నిలిచిన గోళ్ళ రాజేష్ గారు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, చల్లగా ఉండాలని వారు మనస్ఫూర్తిగా దీవించారు.
